తిప్పర్తి : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తిప్పర్తి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన గోలి మాధవరెడ్డి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా తిప్పర్తి మండల కేంద్రంలో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి దుర్మరణం
పెద్దఅడిశర్లపల్లి : బైక్‌పై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండలం చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన మారుపాకుల చెన్నకేశవులు(29) బోర్‌వెల్ బండి నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చెన్నకేశవులు బైక్‌పై అంగడిపేట నుంచి కొండమల్లేపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో తన బోర్‌వెల్ వాహనం కనిపించడంతో బైక్ ఆపి డ్రైవర్‌తో మాట్లాడాడు. అనంతరం బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కారు వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నకేశవులు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని..
హాలియా : బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం తానేదార్‌పల్లి గ్రామ బస్‌స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్లపల్లి అంజిరెడ్డి(23) బైక్‌పై గుర్రంపోడు నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తుండగా.. తానేదార్‌పల్లి గ్రామ బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే దేవరకొండ నుంచి నల్లగొండకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 వాహనంలో దేవరకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి వడ్లపల్లి మణిపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు.
చికిత్స పొందుతూ
వ్యక్తి మృతి
అడ్డగూడూరు : భార్య మృతితో మనోవేదనకు గురై పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామానికి చెందిన సూదిరెడ్డి రాంరెడ్డి(58) భార్య ఐదేళ్ల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి రాంరెడ్డి మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 15న పురుగుల మందు తాగి పొలం వద్ద పడి ఉండగా, అతడి కుమారుడు గమనించి సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. సోమవారం మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.


