చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని పలుగుతండా గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుకాలనీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల మూడు నెలలుగా తెరుచుకోవడం లేదు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు డిసెంబర్‌లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో పాఠశాల మూతపడే ఉంది. ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో విద్యార్థులంతా ఇంటి వద్దే ఉంటున్నారు. కొంతమంది విద్యార్థులు పక్కనే ఉన్న పలుగుతండా ప్రాథమిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ చదువుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని పలుగుతండా వాసులు కోరుతున్నారు.
ఉపాధ్యాయురాలి రాజీనామా
కొత్తవారిని నియమించకపోవడంతో
తెరుచుకోని స్కూల్


