ఓట్లకు నోట్ల వరద
సాక్షి, యాదాద్రి: తుది దశ పల్లె పోరులో పైసల వరద పారుతోంది. ప్రచారం ముగిసిన వెంటనే ప్రతి గ్రామంలో ప్రలోభాలు తారాస్థాయికి చేరాయి. పలువురు అభ్యర్థులు ఓటర్లకు ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చేరువలో ఉన్న చౌటుప్పల్, నారాయణపురం, మోటకొండూరుతోపాటు గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు మండలాల్లో ప్రతి గ్రామంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఉంటున్న వలస ఓటర్లను కూడా రప్పించడానికి అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఒకరిని మించి మరొకరు
అభ్యర్థులు ఎలాగైనా విజయం సాధించాలని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రధానంగా ఓ అభ్యర్థి కొంత నగదు ఇస్తే, మరో అభ్యర్థి దానికి మించి ఇస్తున్నారు. చౌటుప్పల్ మండలంలో ప్రధానంగా దండు మల్కాపురం, ఆరెగూడెం, తూప్రాన్ పేట గ్రామాల్లో పోరు హోరాహోరీగా మారింది. ఓటు అవసరాన్ని బట్టి ఈ మూడు గ్రామాల్లో పార్టీలతో సంబంధం లేని వ్యక్తులకు ఒక్క ఓటుకు రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దండు మల్కాపురం, ఆరెగూడెం గ్రామాల్లో పోటీలో ఉన్న నలుగురు ప్రధాన అభ్యర్థులు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా నారాయణపురం, సర్వేల్, జనగాం, పుట్టపాక, మోటకొండూరు, చాడ, మాటూరు, ముత్తిరెడ్డిగూడెం గ్రామాల్లో డబ్బుల పంపిణీ పోటాపోటీగా సాగింది.
బహిరంగంగానే పంపిణీ..
గెలుపు కోసం హోరాహోరీగా పోరాడిన అభ్యర్థులు గ్రామాల్లో తాయిలాలు మాత్రం దాదాపు బహిరంగంగానే పంచుతున్నారు. ఓటర్లకు ప్రత్యర్థులు డబ్బులు పంచుతున్నారని తెలిసినా అడ్డుకోవడం, ఫిర్యాదు చేయడం లేదు. దీంతో ఎవరికి వారు ఇంటింటికి తిరిగి ఓటర్లకు డబ్బు, మద్యం, మాంసం పంపిణీ చేశారు. మద్యం బాటిళ్ల పంపిణీ కూడా జోరుగా సాగుతోంది.
ఫ తారాస్థాయికి చేరిన ప్రలోభాలు
ఫ ఓటర్లకు ఆన్‌లైన్ పేమెంట్ చేస్తున్న అభ్యర్థులు
ఫ ఒకరిని మించి మరొకరు డబ్బుల పంపిణీ


