హోరాహోరీ.. గెలుపెవరిది!
ఈ గ్రామాల్లో హోరాహోరీ
తుది విడతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు
సాక్షి, యాదాద్రి : పది రోజులుగా హోరెత్తిన మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. చివరి రోజు అన్ని చోట్ల అభ్యర్థులు, వారికి మద్దతుగా ముఖ్య నాయకులు ముమ్మర ప్రచారం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తమవంతు ప్రయత్నాలు చేశారు. ర్యాలీలు, రోడ్ షోలు, ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలవడం వంటివి చేశారు. గెలిస్తే రానున్న ఐదేళ్లలో ఏం చేస్తామో వివరించారు.114 సర్పంచ్ స్థానాల్లో 338 మంది, 993 వార్డుల్లో 2,395 మంది అభ్యర్థులు ఈనెల 17న తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అత్యధిక స్థానాలపై ఫోకస్
మొదటి విడత ఫలితాల్లో కాంగ్రెస్ పైచేయి సాధించగా, మలి విడతలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు పోటాపోటీగా సీట్లు సాధించాయి. ఈ రెండు దశల్లో వచ్చిన స్థానాలను బేరీజు వేసుకున్న ఇరు పార్టీలు.. మూడో విడత ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వీలైనన్ని ఎక్కువ పంచాయతీల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రణాళికలు రచించాయి. పోలింగ్‌కు కొద్ది గంటలకే సమయం మిగిలి ఉండటంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి. సోమవారం సాయంత్రం ప్రచారం ముగిసిన మరుక్షణం నుంచే ఆయా పార్టీల మద్దతుదారులు ప్రలోభాలకు తెరలేపారు. అర్ధరాత్రి వరకు ఒకరికి మించి ఒకరు తాయిలాలు అందజేశారు. ఇంటింటికీ చికెన్, మద్యం, చీరలు, ఇతర గిఫ్టుల పంపిణీతో పాటు నగదు పంపిణీ చేసినట్లు తెలిసింది.
మైనర్ పంచాయతీల్లోనూ ఓటుకు రూ.5వేలు!
చౌటుప్పల్ మండలంలో మైనర్ పంచాయతీలైన మసీదుగూడెం, అల్లాపురం, కాట్రేవు, చింతలగూడెం, కై తాపురం, కుంట్ల గూడెం, నెలపట్ల, గుండ్లబావి, ధర్మోజిగూడెం, చిన్నకొండూరులో ఓటుకు రూ.5వేలు ఇచ్చినట్లు తెలిసింది.
చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం, ఆరెగూడెం, తూప్రాన్‌పేట గ్రామాల్లో పోరు హోరాహోరీగా సాగింది. తూప్రాన్‌పేటలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, దండుమల్కాపురంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఆరెగూడెంలో బీజేపీ, స్వతంత్రుల మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ నెలకొంది. ఇప్పటికే మొదటి విడతగా నగదు, చీరలు పంపిణీ చేసినట్లు తెలిసింది. సోమవారం రాత్రి కూడా మరో దఫా నగదు, మందు, ఇతర కానుకలు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూడు పంచాయతీల్లో ఒక్కో ఓటు వేలల్లో పలుకుతోంది. దండుమల్కాపురం, ఆరెగూడెంలో బరిలో ఉన్న నలుగురు ప్రధాన అభ్యర్థులు ఇప్పటికే రూ.కోట్లలో ఖర్చు చేసినట్లు సమాచారం. పోలింగ్ సమయానికి ఒక్కో అభ్యర్థి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక తూ ప్రాన్‌పేటలో ఒక్కో అభ్యర్థి రూ.కోటి నుంచి రూ.కోటి 50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
ఫ మెజార్టీ స్థానాలపై గురి
ఫ ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపిన మద్దతుదారులు
ఫ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీగా తాయిలాలు
హోరాహోరీ.. గెలుపెవరిది!


