ఏపీలోనూ యాదగిరీశుడి కల్యాణోత్సవాలు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణోత్సవాలను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ నిర్వహించనున్నామని ఆలయ ఈవో వెంకట్రావ్ వెల్లడించారు. బుధవారం తన కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది (2026) జనవరి 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేటలో, 5వ తేదీన పిడుగురాళ్లలో శ్రీ స్వామివారి కల్యాణోత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి జగ్గయ్యపేటకు నోడల్ ఆఫీసర్‌గా ఏఈవో కృష్ణ, పిడుగురాళ్లలో జరిగే కళ్యాణానికి నోడల్ ఆఫీసర్‌గా ఏఈవో మహేష్‌ను నియమించినట్లు తెలిపారు. శ్రీ స్వామి వారి ప్రచార రథం ద్వారా శ్రీ స్వామివారి ఆలయ చరిత్ర, మహిమలు, దేవస్థానం అభివృద్ధి, రాబోయే కార్యక్రమాలను విస్తరిస్తూ ఈ వేడుకలను జరిపించనున్నట్లు పేర్కోన్నారు. ఇటీవలనే కొత్తగా ప్రారంభించిన అన్నదాన కేంద్రంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భక్తుల రద్దీ, పండుగ రోజుల్లో ప్రత్యేక ఏర్పాట్లు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, సేవకుల నియామకాల వంటి అంశాలపై దృష్టిసారించాలని సూచించారు. కొండ కింది అన్నదాన ప్రాంగణం, లక్ష్మీ పుష్కరిణి, కళ్యాణ కట్టతో పాటు భక్తులు అధికంగా ఉండే ప్రాంతాలలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలన్నారు. ఈ సమావేశంలో అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, డిప్యూటీ ఈవో భాస్కర్ శర్మ, ఆలయాధికారులు, అర్చకులున్నారు.
జనవరి 3న జగ్గయ్యపేట, 5న పిడుగురాళ్లలో స్వామివారి కల్యాణం
యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావ్ వెల్లడి


