కృష్ణా తీరంలో వ్యర్థ రసాయనాలు
మఠంపల్లి : రసాయనాలు కలవడంతో మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణా నది తీరం కలుషితమవుతోంది. గత 15 రోజుల నుంచి గుర్తుతెలియని వ్యక్తులు రసాయనాలు తెచ్చి నదిలో పోయడంతో కృష్ణా నది తీరంలోని నీరు ఆకుపచ్చ, నీలం రంగులోకి మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మట్టపల్లి గ్రామం వద్ద కృష్ణా నది రేవు సమీపంలోనే కృష్ణా నది జలాలు సరఫరా చేసే టేక్‌వెల్ ఉండటంతో సంబంధిత అధికారులు గమనించి నీటి సరఫరాను నిలిపివేశారు. 15రోజుల క్రితం వరకు నది అవతలి భాగంలో పల్నాడు జిల్లా వైపు నీరు కలుషితమై కనిపించిందని, ఇప్పుడు మట్టపల్లి వైపు నది కలుషితమైందని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు కలుషిత నీటిని పరిశీలనకు తీసుకెళ్లారు. నదీలో స్నానం చేయడాన్ని నిలిపివేశారు. నీరు కలుషితం కావడంతో మత్స్యకారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ జరిపి కృష్ణా నదిలో రసాయనాలు వదిలే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
మట్టపల్లి వద్ద నదిలోకి వదులుతున్న
గుర్తుతెలియని వ్యక్తులు


