నా ఖర్చు 25 రూపాయలే..
ఫ గట్టుప్పల్ మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి
గట్టుప్పల్ : 1970లో సర్పంచ్ ఎన్నికకు రూ.25 మాత్రమే ఖర్చు పెట్టినట్లు గట్టుప్పల్ మాజీ సర్పంచ్ పోరెడ్డి ముత్తారెడ్డి తెలిపారు. ఆనాడు గ్రామంలో 2,900 ఓటర్లు ఉండగా.. 9 వార్డులు ఉండేవి. గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికల్లో ముత్తారెడ్డితో పాటు మరో ముగ్గురు సీసీఐ మద్దతుతో వార్డు సభ్యులుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరో నలుగురు గెలువగా, ఒకరు ఇండిపెండెంట్‌గా విజయం సాధించారు. అప్పట్లో సర్పంచ్ ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగగా ముత్తారెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రతిపాదించగా ఇండిపెండెంట్‌గా గెలిచిన అభ్యర్థి మద్దతు తెలుపడంతో మొత్తం ఐదుగురి మద్దతుతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సర్పంచ్ ఎన్నిక సందర్భంగా వార్డు సభ్యులకు టిఫిన్స్, టీ, పేపర్ ఖర్చులకు రూ.25 ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. వార్డు సభ్యులకు, ఓటర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఆనాడు ఓటర్లు నిజాయితీగా ఓటు వేసే వారని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం వార్డు సభ్యుడిగా ఎన్నిక కావడానికే లక్షల్లో ఖర్చు వస్తుందని పేర్కొన్నారు.


