నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
సూర్యాపేటటౌన్ : అమాయక ప్రజలకు నకిలీ బంగారు బిస్కెట్లు అంటగడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఈ కేసు వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన నాగేశ్వరరావు అలియాస్ రాజారావు, బాల, మేడి ఆదినారాయణ, ప్రకాశం జిల్లా పెద్దఆరవీడు మండలానికి చెందిన కుండూరు యోగిరెడ్డి, పిట్ట నాగిరెడ్డి, ఇదే జిల్లా రాజులపాడుకు చెందిన చంద్ర, గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఇర్రి నరేశ్, ఖమ్మం జిల్లా వైరాకు చెందిన సుధాకర్ ముఠాగా ఏర్పడి అమాయక ప్రజలకు మాయమాటలు చెప్పి నకిలీ బంగారాన్ని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వీరి వద్ద హనుమకొండకు చెందిన వెంకటేశ్వరరావు, లీలా అనే ఇద్దరు రూ.18 లక్షలకు పది బంగారు బిస్కెట్లు(ఒక్కోటి 20 గ్రాములు) కొనుగోలు చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు వారు ఈ నెల 6న సూర్యాపేట మండలం బాలెంల గ్రామ శివారులో నాగేశ్వరరావు అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద అతడికి రూ.12 లక్షలు చెల్లించగా.. వారికి ఐదు నకిలీ బంగారు బిస్కెట్లను నాగేశ్వరరావు అంటగట్టాడు. మిగతా డబ్బు చెల్లించిన తర్వాతే మరో ఐదు బంగారు బిస్కెట్లు ఇచ్చేలా అంగీకారం కుదుర్చుకున్నారు. కాగా గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో వారిచ్చిన డబ్బును నాగేశ్వరరావు తాత్కాలికంగా ఇర్రి నరేశ్ వద్ద ఉంచాడు. అయితే నరేశ్ వద్ద ఉన్న డబ్బును సోమవారం బాలెంల సమీపంలోని ఖమ్మం జాతీయ రహదారి ఫ్లైఓవర్ వద్దకు తీసుకురావాలని నాగేశ్వర్‌రావు సూచించాడు. అదేవిధంగా వెంకటేశ్వరరావు, లీలాను కూడా మిగతా డబ్బు తీసుకొచ్చి మిగిలిన ఐదు బంగారు బిస్కెట్లు తీసుకెళ్లాలని కోరాడు. వీరంతా బాలెంల సమీపంలోని ఫ్‌లైఓవర్ వద్దకు చేరుకోగా.. విశ్వసనీయ సమాచారం మేరకు సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ బాలునాయక్ పోలీస్ సిబ్బందితో కలిసి దాడి చేసి ఇర్రి నరేశ్, మేడి ఆదినారాయణ, కుండూరు యోగిరెడ్డి, పిట్ట నాగిరెడ్డిని అరెస్ట్ చేశారు. మిగతా ఐదుగురు పరారయ్యారు. పట్టుబడిన వారి నుంచి ఐదు నకిలీ బంగారు బిస్కెట్లు, రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ఫ నలుగురి అరెస్టు
ఫ మరో ఐదుగురు పరారీ


