జర.. యాదిమర్వకే..
ఊర్లె పెసిడెండ్గ పోటీ జేత్తున్న కొమురయ్య పొద్దుపొద్దుగాల లేసి కాసింత చాయ్‌తాగి పెచారాన్కి బయలెళ్లిండు. ముందుగాల నర్సన్న ఇంటికాడకి పోయిండు.
కొమురయ్య: నర్సన్నా ఇంట్ల ఉన్నావే..
నర్సన్న: ఎవరూ..
కొమురయ్య: నేనే.. కొమురయ్యను..
నర్సన్న: రా.. ఇంట్లకి రావే.. పొద్దుగాల తీర్బాటం చేస్కొని వచ్చినవేందే..
కొమురయ్య: దండాలే నర్సన్నా.. వదినా నమస్తే.. అంతాబాగేనానే.. ఏంలేదే. నేను ఎలచ్చన్ల పెసిడెండ్గ పోటీ జేత్తన్న. నా మీద కొంచెం దయ ఉంచాలే. ఏదన్నా ఉంటే నేనర్సుకుంట.
నర్సన్న: సరేనే..
అక్కడ్నుంచి పక్క నున్న రాజన్న
ఇంటికెళ్లిండు కొమురయ్య
కొమురయ్య: రాజన్న బావ మంచిగున్నవానే. అక్కా ఎట్లున్నవే.. పిల్లలేరి?
రాజన్న: అంతామంచిగనే ఉన్నం. పిల్లలు పనిమీద పట్నం పోయిండ్రే.
కొమురయ్య: నేను పోటీజేత్తన్న.. బావ, అక్క నన్ను మరవొద్దు.. మీకు పనుల్ జేసి పెడ్త.. జర గుర్తుంచుకోండి..
కొమురయ్య ఓ గుడిసెలో ఒంటరిగా కుక్కిమంచంలో పడుకున్న పుల్లవ్వ కాడికిపోయిండు
కొమురయ్య: దండాలు పుల్లవ్వా అంటూ కాళ్లుమీదబడ్డడు.. ఎట్లున్నవవ్వా.. బువ్వతిన్నవానే..
పుల్లవ్వ: పాణంబాలేదు.. జర సుస్తుగుంది మనవడా.. గిప్పుడే బుక్కెడు బువ్వదిని అడ్డం ఒరిగిన.. మర్సిపోయి గీపేద దానింటి
కొచ్చినవ్ మనవడా..
కొమురయ్య: అదేంలేదవ్వ.. ఎలచ్చన్లొచ్చినయ్‌గదా.. నేను పెసిడెండ్గ పోటీ జేత్తన్న..
గిది నాగుర్తు.. జర యాదిమర్వకు..
అక్కడి నుంచి నిమ్మలంగా నడ్చుకుంటూ బజారెంట పోతుంటె జానిమియా కలిసిండు
కొమురయ్య: సలామలైకుం జానిభాయ్ అంటూ అలయ్‌బలయ్ తీసుకున్నడు
జానిమియా: వాలైకుమస్సలాం..
కొమురయ్యభాయ్..
కొమురయ్య: జర మేరెకు ఓట్ దాలో భాయ్..
జానిమియా: అచ్ఛా.. జరూర్
అక్కడి నుంచి బోతుంటే రాజేష్ కలిసిండు..
కొమురయ్య: ఏం తమ్మీ ఎట్లున్నవ్.. పట్నం నుంచి ఎప్పుడొచ్చినవ్.. సదువయిపోయిందా.. ఈసారి నేను పోటీ జేత్తన్న నీ ఓటు నాకే ఎయ్యాలే.. జర మరవకు..
రాజేష్: బాగున్ననే.. పట్నం నుంచి నిన్నవచ్చిన్నే.. ఫైనల్ ఇయర్ చదువుతున్న.. ఈసారి అయిపోతదే.. సరే.. నీకే ఏస్తనే..
తొవ్వెంటబోతుంటే రజిని కలిసింది
కొమ్మురయ్య: చెల్లీ ఎటుబోతున్నవ్‌రా.. ఇంట్ల నాయినున్నాడ్రా.. చెల్లీ నీఓటు నాకే ఎయ్
రజిని: దుక్నం పోతున్న.. ఇంట్ల డాడీ ఉన్నడు. తప్పకుండా ఏస్తలే. అమ్మటాళ్లైంది..
ఇంటికిబోదం అంటూ కొమురయ్య
పెచారం ముగించాడు. – నల్లగొండ డెస్క్


