దళితుల ప్రాణాలకు విలువ లేదా
కోదాడ : పోలీసులు చిత్రహింసలు పెట్టడం వలనే రిమాండ్ ఖైదీగా ఉన్న కర్ల రాజేష్ మృతిచెందాడని, ఈ ఘటనపై అతడి తల్లి రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఏమిటని, దళితుల ప్రాణాలకు విలువ లేదా..? అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రశ్నించారు. సోమవారం కోదాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిలుకూరు ఎస్‌ఐ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కాకపోతే అతడి చర్యలు తీసుకునేవారని, రెడ్డి కావడం వల్లే అతడిని రక్షిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజేష్ మృతిపై అతని తల్లి నవంబర్ 18 ఒక డీఎస్పీకి, నవంబర్ 30న మరో డీఎస్పీకి ఫిర్యాదు చేసినా నేటికీ కేసు నమోదు చేయకపోవడం చూస్తుంటే తప్పుచేసిన పోలీసులను ఉన్నతాధికారులు రక్షిస్తున్నారని అర్థమవుతుందన్నారు. 5వ తేదీన రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారని అప్పటి నుంచి అతడు మృతిచెందే వరకు వివిధ ప్రాంతాల్లో తిప్పారని, దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులే దానిని అతిక్రమిస్తున్నారని ఆరోపించారు. రాజేష్ మృతిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే స్పందించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించడంతో పాటు డీజీపీకి, గవర్నర్‌కు లేఖ రాయాలని కోరారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాజేష్ తల్లి మంగళవారం జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తుందని దీనిపై ఎస్పీ తగు విధంగా స్పందించకపోతే తమ కార్యాచరణ వేరే విధంగా ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఏపూరి రాజు, కొండపల్లి అంజనేయులు, కోటేష్, సత్యరాజు, కృష్ణ, నాగరాజు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక
అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


