రేడియో రూమే... పంచాయతీ కార్యాలయం
నడిగూడెం : మండలంలోని బృందావనపురం గ్రామ పంచాయతీ నేటికీ సొంత భవనానికి నోచలేదు. 1971లో బృందావనపురం, వేణుగోపాలపురం గ్రామాలను కలిపి పంచాయతీగా ఏర్పాటు చేశారు. 54 ఏళ్లుగా గ్రామంలోని రేడియో రూమ్‌లోనే పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. ఇరుకై న గది సరిపోక వరండాలోనే పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గం విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు కూలుతుందో తెలియక నిత్యం భయాందోళనతోనే విధులు నిర్వహించాల్సి వస్తున్నదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రేడియో రూమ్ అంటే..
బృందావనపురం గ్రామ పంచాయతీగా ఏర్పడిన కొత్తలో గ్రామంలో రేడియోలు ఎక్కడో ఒకటి ఉండేవి. గ్రామస్తులు రేడియోలో వచ్చే వార్తలు, పాటలు, వినోద కార్యక్రమాలు వినేందుకు వారి వద్దకు వెళ్లాల్సి వచ్చేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు, ప్రజలందరికీ రేడియో కార్యక్రమాలు వినిపించేందుకు అప్పటి ప్రభుత్వం గ్రామంలో ఒక గదిని నిర్మించింది.ఇందులో మైక్ సెట్ ఏర్పాటు చేసి రేడియోలో వచ్చే వార్తలు, వివిధ కార్యక్రమాలు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో గ్రామస్తులందరికీ వినిపించే వారు. అలా ఈ గదికి రేడియో రూమ్‌గా పేరు పడిపోయింది.
అసంపూర్తిగా భవన నిర్మాణం
ఏడేళ్ల కిందట గ్రామ పంచాయతీకి కొత్త భవన నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.12 లక్షలు మంజూరు చేసింది. పనులు కూడా ప్రారంభించారు. అయితే నిధులు సరిపోక పోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం కొత్గగా వచ్చే పాలక వర్గం విధులు నిర్వహించడం కష్టంగా మారనుంది.


