ఖర్చుల లెక్క.. చూపాలి పక్కా
భూదాన్‌పోచంపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న పత్రి అభ్యర్థి ప్రచారానికి సంబంధించిన లెక్కలను పక్కాగా అధికారులకు సమర్పించాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆదివారం భూదాన్‌పోచంపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. వారికి ఎన్నికల వ్యయంపై అవగాహన కల్పించారు. అభ్యర్థులు తమ ఖర్చుల లెక్కలను ఈ నెల 9, 12వ తేదీల్లో రెండు విడతలుగా చూపాలన్నారు. అంతేకాక ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ఫలితాలు వెలువడిన రోజు నుంచి 45 రోజుల్లోగా ఖర్చుల పూర్తి వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. చూపనిపక్షంలో గెలిచిన వారి అభ్యర్థితత్వం రద్దు అవుతుందని, ఓడినవారు మూడు టర్మ్‌లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తారని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు, ర్యాలీలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. కరపత్రాల్లో సదరు ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్, ఎన్ని ప్రతులు ప్రచురించారనే వివరాలు ఉండేలా జాగ్రత్తపడాలని పేర్కొన్నారు. డబ్బు, మద్యం, కానుకలతో ఓటర్లను ప్రలోభపెడితే వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయన్నారు. సమావేశంలో మండల వ్యయ పరిశీలకుడు సురేశ్, ఎంపీడీఓ రాపర్తి భాస్కర్, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల వ్యయ పరిశీలకుడు శ్రీనివాస్


