వైద్యానికి వస్తే ఒక్కరూ లేరు!
తుర్కపల్లి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అత్యవసర సేవల కోసం వచ్చిన బాధితులకు ఇక్కట్లు తప్పడం లేదు. లక్ష్మాపురంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఆదివారం సాయంత్రం పురుడు పోసుకొని వైద్యంకోసం 108 అంబులెన్స్‌లో పీహెచ్‌సీకి వచ్చింది. ఆ సమయంలో ఆస్పత్రిలో ఎవ్వరూ లేరు. 24 గంటలు వైద్యసేవలందించాల్సిన ఈ వైద్యశాలలో ఒక్కరూ లేకపోవడంతో వచ్చిన ఆంబులెన్స్‌లో భువనగిరిలోని ఏరియా ఆస్పత్రికి వెనుదిరిగారు. ఈ విషయమై వైద్యాధికారి రుచిరారెడ్డిని వివరణ కోరగా సిబ్బంది కొరత ఉందని తెలిపారు. ఇద్దరు నర్సులు ఉండగా ఉదయం ఒకరు, నైట్ షిఫ్ట్‌లో ఒకరు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. సరిపడా సిబ్బంది లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న ఇద్దరు.. అదనపు గంటలు డ్యూటీ చేయాల్సి వస్తుందని వివరణ ఇచ్చారు.


