వాహనాల తనిఖీ ముమ్మరం
నేరేడుచర్ల : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీం (ఎఫ్‌ఎస్‌టీ) వాహనాల తనిఖీలు ముమ్మరం చేసింది. శుక్రవారం నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి టోల్‌ప్లాజా వద్ద ఎఫ్‌ఎస్‌టీ సిబ్బంది ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఎస్‌టీ అధికారి చంద్రమ్మ మాట్లాడుతూ..ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలను చేపడుతున్నామన్నారు. సూర్యాపేట– నల్లగొండ జిల్లాలకు సరిహద్దు ప్రాంతం అయిన చిల్లేపల్లి వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు సమీపంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బులు, మద్యంతో పాటు ఇతర బహుమతులు రవాణా చేసే అవకాశం ఉన్నందున నిఘా పెంచామన్నారు. ఈ తనిఖీల్లో ఏఎస్‌ఐ సురేందర్, పోలీస్ సిబ్బంది సురేందర్, లింగయ్య, వెంకన్న తదితరులు ఉన్నారు.


