ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
చండూరు : భూమికి సంబంధించి మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ సమాచారం ఇచ్చేందుకుగాను నల్లగొండ జిల్లా చండూరు డిప్యూటీ తహసీల్దార్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గట్టుప్పలకు చెందిన ఉస్మాన్ షరీఫ్ తండ్రి జమాల్ షరీఫ్ 2017లో మృతిచెందాడు. ఆయనకు వంశపారపర్యంగా వచ్చిన 58 ఎకరాల 31 గుంటల భూమి ఉండగా.. అందులో నుంచి జమాల్ వదిన అయిన ఇక్బాల్ బేగం 2008లో 21 ఎకరాల 13 గుంటలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుందని తండ్రి మృతి అనంతరం ఉస్మాన్‌కు తెలిసింది. అప్పటి నుంచి మ్యూటేషన్ ప్రొసీడింగ్స్ కావాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు స్పందించకపోవడంతో ఉస్మాన్ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ను కలిశాడు. గత అక్టోబర్‌లో అప్పుడు తహసీల్దార్‌గా ఉన్న చంద్రశేఖర్‌ను పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు. కానీ, జూనియర్ అసిస్టెంట్ హాజరవ్వడంతో కమిషనర్ ఆగ్రహించి చంద్రశేఖర్‌ను నేరుగా హాజరవ్వాలని సూచించారు. ఈ క్రమంలో ఈనెల 2న ప్రస్తుత డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ స్వయంగా ఉస్మాన్‌కు ఫోన్ చేసి ఫైల్ దొరికిందని, కొంత డబ్బు ఇవ్వాలని కోరాడు. ఈమేరకు హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో ఉన్న తన నివాసానికి రావాలని సూచించాడు. ఉస్మాన్ అదేరోజు ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని వివరించాడు. గురువారం రాత్రి 9.30 గంటలకు చంద్రశేఖర్ తన నివాసం వద్ద కారులో ఉస్మాన్ నుంచి రూ.20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అదేవిధంగా ఆయన ఇంటిలో సోదాలు నిర్వహించారు. అదేరోజు రాత్రి 12.30 గంటలకు చంద్రశేఖర్‌ను చండూరు తహసీల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి సోదాలు చేశారు. విచారణ అనంతరం ఆయనను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
రూ.20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు


