అభ్యర్థులపై అధికారుల నిఘా
రాజాపేట : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మొదటి విడుతలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. మిగతా చోట్ల కూడా ప్రచారానికి సిద్ధమవుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యడి స్థానానికి పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తే వేటు పడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. అభ్యర్థుల కదలికలను ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీం (ఎస్‌ఎస్‌టీ), వీడియో సర్వే లెన్స్ టీం, వీడియో వ్యూయింగ్ టీం (వీవీటీ), వీడియో సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, అకౌంటింగ్ టీం (ఏటీ), అసిస్టెంట్ ఎక్స్‌పెండీచర్ అబ్జర్వర్ (ఏఈఓ) ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు.
ఖర్చులు.. చెల్లింపులు
అభ్యర్థులు నామినేషన్ సమయంలో ఇచ్చిన బ్యాంక్ ఖాతా ద్వారానే చట్టబద్ధమైన ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ప్రతి ఖర్చుకు బిల్లులుండాలి. రూ.5వేల లోపు ఖర్చు నగదుగా అంతకంటే ఎక్కువైతే చెక్కు లేదా అన్‌లైన్ పేమెంట్‌తో ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఓటర్లను ప్రలోభ పెట్టొద్దు
మద్యం, మాంసం, డబ్బుతో పాటు ఏ ఇతర వస్తువులను ఓటర్లకు ఇచ్చి వారిని ప్రలోభ పెట్టొద్దు. ప్రచార సమయంలో అభ్యర్థి వద్ద లేదా అతడికి సంబంధించిన వ్యక్తి వద్ద రూ.10వేలకు మించి డబ్బలు ఉండొద్దు. పోలింగ్‌కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. పోలింగ్ రోజు కేంద్రాల నుంచి 100 మీటర్ల పరిధిలో ఎలాంటి ప్రచారం చేయవద్దు.


