గంజాయి విక్రేతల అరెస్టు
పెద్దవూర : గంజాయి విక్రయిస్తున్న ఇద్దరితోపాటు, కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని అరెస్టు చేసి, కేజీన్నర గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఇద్దరు మంజుల శ్రీను, షేక్ గాలిబ్‌లు తిరుమలగిరి సాగర్ మండలం శ్రీరాంపల్లి గ్రామానికి చెందిన దేశం విజయేందర్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ బరిగల మహేష్‌లకు గంజాయి విక్రయించేందుకు పొట్టిచెల్మ ఎక్స్‌రోడ్డు సమ్మక్క–సారలమ్మ గద్దెల సమీపానికి గురువారం వచ్చారు. కిలోన్నర గంజాయికి రూ.33వేలకు మాట్లాడుకున్నారు. వారి వద్ద గంజాయి అందుబాటులో లేకపోవడంతో అడ్వాన్సుగా రూ.31వేలు ఇచ్చి గంజాయి సరఫరా సమయంలో మిగతా రూ.2వేలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. ఈమేరకు శుక్రవారం గంజాయిని ఇచ్చేందుకు మంజుల శ్రీను, షేక్ గాలిబ్‌లు గంజాయిని సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్దకు వచ్చారు. విజయేందర్‌రెడ్డి, మహేష్‌లకు గంజాయిని ఇచ్చి మిగిలిన రూ.2వేలు తీసుకుంటుండగా అప్పటికే వీరిపై నిఘా పెట్టిన పోలీసులు వారిని పట్టుకుని పెద్దవూర పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద రూ.33వేల విలువైన కిలోన్నర గంజాయి, బైక్, మూడు సెల్‌ఫోన్‌లు, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిని విచారించగా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని తీసుకుని వచ్చి ఈ ప్రాంత యువతకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మంజుల శ్రీనుపై అనేక కేసులు ఉన్నాయని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని పేర్కొన్నారు.


