పోచంపల్లిలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు
భూదాన్‌పోచంపల్లి : హైదరాబాద్‌లోని హమ్స్‌టెక్ కాలేజీకి చెందిన 25 మంది ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు శుక్రవారం భూదాన్‌పోచంపల్లిని సందర్శించారు. ఈ సందర్భంగా రూరల్ టూరిజం పార్కు, చేనేత గృహాలకు వెళ్లి మగ్గాలు, ఇక్కత్ వస్త్రాలు, చేనేత డిజైన్లు, రంగులద్దకం తదితర వస్త్ర తయారీ ప్రక్రియలను పరిశీలించారు. ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యతను అడిగి తెలుసుకున్నారు. మగ్గం నేసి, రాట్నం వడికి, సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఫ్యాకల్టీలు దివ్య, శ్రావణి మాట్లాడుతూ మగ్గాలపై ఇక్కత్ వస్త్రాలను నేసే ఇధానం, చేనేత కళాకారుల శ్రమ, కళానైపుణ్యాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు స్టడీ టూర్‌లో భాగంగా పోచంపల్లిని సందర్శనకు వచ్చామని తెలిపారు.


