హైటెక్ ప్రచారం
సోషల్ మీడియాకు తోడైన ఏఐ
అభ్యర్థులూ.. తస్మాత్ జాగ్రత్త
ప్రచారంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తుండగా.. దానికి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా తోడైంది. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ప్రచార వీడియోలు, ప్రకటనలు రూపొందించి వాట్సాప్ గ్రూప్‌లలో పోస్టు చేస్తున్నారు. తాము గెలిస్తే గ్రామాన్ని సుందరీకరిస్తాం, లైబ్రరీ ఏర్పాటు చేస్తాం, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం, సీసీ రోడ్లు వేయిస్తాం.. అని ఇలా హామీలు ఇస్తున్నారు. అవన్నీ పూర్తయితే ఎలా ఉంటుందో ఏఐ ద్వారా కళ్లకు గట్టినట్లు చూపుతున్నారు. ఇవన్నీ తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లకు చేరువయ్యేలా ఏఐ దోహదపడుతోంది. అంతేకాకుండా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడం, తమ గురించి పాజిటివ్‌గా ప్రచారం చేయడం వంటి పనులను చేస్తోంది. యాదగిరిగుట్ట మండలం మాసాయిపేటతో పాటు పలు పంచాయతీల్లో అభ్యర్థులు ఏఐ ద్వారా ప్రచారం చేస్తున్నారు. వీటితో పాటు రీల్స్ చేసి ఫేస్‌బుక్, ఇన్‌స్ర్ట్రాగామ్‌లో షేర్ చేసి ఓటర్లకు చేరువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
సమస్తం ఫోన్‌లోనే..
గతంలో ఎన్నికల ప్రచారం వాల్‌రైటింగ్, డోర్, వాల్‌పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలకు పరిమితం అయ్యేది. అభ్యర్థులు, వారి అనుచరులు ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి తమకు ఓటేయాలని అభ్యర్థించేవారు. కాలానుగుణంగా ప్రచారశైలి మారిపోయింది. మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటర్‌నెట్ అందుబాటులోకి రావడంతో సామాజిక మాద్యమాల వినియోగం కూడా విస్తృతంగా పెరిగిపోయింది. ఫేస్‌బుక్, వాట్సప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్ర్ట్రాగామ్, ఎక్స్ తదితర సోషల్ మీడియా(సామాజిక మాధ్యమాలు)ను వేదికగా మార్చుకుంటున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మంచి అభ్యర్థిని గెలిపించాలని, తాము గెలిస్తే ఊరికి ఏం చేస్తారో చెబుతున్నారు. అభ్యర్థి ప్రసంగాలు, ప్రచార కార్యక్రమాలను వాటిలో పోస్టు చేస్తున్నారు. అలాగే కుల, మహిళా, యువజన సంఘాలు, ఫ్రెండ్స్, వాకర్స్.. ఇలా వర్గాల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు చేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అయోమయ స్థితిలో ఓటర్లు
సామాజిక మాధ్యమాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అభ్యర్థులు ఎవరికి వారు తమకు నచ్చిన రీతిలో ప్రచారం సాగిస్తుండటం ఓటర్లను విసుగెత్తిస్తోంది. ఏది నిజమో, ఏది అబద్దమో తెలియని అయోమయ స్థితి నెలకొంది. దీంతో పలు గ్రూప్‌ల అడ్మిన్‌లు అభ్యర్థుల ప్రచా రాన్ని అడ్డుకునే మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగంగా వాట్సాప్ గ్రూప్‌లలో ఓన్లీ అడ్మిన్ సెండ్ ఆప్షన్, మరికొందరు ఆర్చీవ్‌డ్‌గా వాడుతున్నారు.
ఫ సామాజిక మాధ్యమాలే వేదిక
ఫ గ్రామాలు, వార్డుల వారీగా వాట్సాప్ గ్రూప్‌లు
ఫ ఏఐ టెక్నాలజీ సైతం వినియోగం
ఫ తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లకు దగ్గర
ఫ సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్న అభ్యర్థులు
సాక్షి యాదాద్రి: భువనగిరి మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్న వ్యక్తి తన ప్రచార కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సామాజిక మాద్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏకంగా ఒక వ్యక్తిని నియమించుకున్నాడు.
యాదగిరిగుట్ట మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సామాజిక మాద్యమాలు వేదిక ప్రచారం చేస్తున్నాడు. ఈసారి ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాడు. తనను గెలిపిస్తే చేపట్టనున్న పనులను గ్రామ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు.. మారుతున్న కాలానుగుణంగా అభ్యర్థులు పంచాయతీ ఎన్నికల్లో ప్రచారశైలిని మార్చారు. సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వేదికలుగా మలుచుకుంటున్నారు.
సామాజిక మాధ్యమాలు వేదికగా అభ్యర్థులు చేస్తున్న ప్రచారంపై ఎన్నికల బృందాలు నిఘా పెట్టాయి. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు ఉండాలే తప్ప.. ఏ ఒక్క వర్గం మనోభావాలను కించపరిచే విధంగా, వక్రీకరించేలా, తప్పుదారి పట్టించే విధంగా ఉండవద్దు. డీప్‌ఫేక్స్, మహిళలపై అవమానకరమైన కంటెంట్, పిల్లలను ప్రచారంలో ఉపయోగించడం వంటివి నిషేధం. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారం జరగాలి. ఏవిధమైన ఉల్లంఘనలు జరిగినా అభ్యర్థిపై చర్యలు తీసుకుంటారు.


