చివరి దశకు కొనుగోళ్లు
ఊపందుకున్న యాసంగి పనులు
రామన్నపేట: వానాకాలం ధాన్యం సేకరణ తుది దశకు చేరింది. మరో పది రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి కానుంది. జిల్లాలో 17 మండలాల్లో వరి సాగు చేశారు. జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుమతి వస్తుందని, 3.50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. పీఏసీఎస్, ఐకేపీ, ఎఫ్‌పీఓల ద్వారా 330 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు.
శుక్రవారం వరకు కొనుగోలు చేసిన ధాన్యం
శుక్రవారం సాయంత్రం వరకు 148 ఐకేపీ సెంటర్ల ద్వారా 1,01, 274 మెట్రిక్ టన్నులు, 164 పీఏసీఎస్ సెంటర్ల నుంచి 1,42,112 మెట్రిక్ టన్నులు, 15 ఎఫ్‌పీఓ కేంద్రాల ద్వారా 14,299 మెట్రిక్ టన్నులు, మూడు మెప్మా సెంటర్లలో 2,896 మెట్రిక్ టన్నుల ధాన్యం.. మొత్తం 2,60,582 మెట్రిక్ టన్నుల వడ్లు సేకరించారు. కాగా అందులో ఫైన్ రకం 4,999 మెట్రిక్ టన్నులు, గ్రేడ్–1 రకం 1,10,520 మెట్రి క్‌టన్నులు, సాధారణ రకం 1,45,062 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. 67 కేంద్రాల్లో ధాన్యం సేకరణ పూర్తయింది.
వెనువెంటనే చెల్లింపులు
35,722 మంది రైతుల నుంచి రూ.604.05 కోట్లు విలువ చేసే ధాన్యాన్ని కొనుగోలు చేశారు. శుక్రవారం నాటికి రైతుల ఖాతాల్లో రూ.542 కోట్లు జమ చేశారు. ట్రక్‌షీట్ జనరేట్ అయిన రెండుమూడు రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం జరిగింది. రైతులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నామని సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను టాబ్‌లో ఎంట్రీ చేసిన రెండుమూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతున్నట్లు పేర్కొన్నారు.
యాసంగి సీజన్‌కు సంబంధించి వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వానాకాలం వరికోతలు దాదాపు పూర్తవడంతో చాలా మంది రైతులు మడులను సిద్ధం చేసి తూకం పోస్తున్నారు. 3,12,500 ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాలకు చెరవులు, కుంటలు నిండి భూగర్భ జలమట్టం పెరిగింది. వీటికి తోడు మూసీ ఆధారిత కాలువలు, గోదావరి జలాలు అందుబాటులో ఉండడంతో అంచనాలకు మించి వరి సాగయ్యే అవకాశం ఉందని అధికారులు బావిస్తున్నారు.
ట్రాక్టర్‌తో మడిని సిద్ధం చేస్తున్న రైతు
ఫ 2.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
ఫ రైతుల ఖాతాల్లో రూ.542 కోట్లు జమ


