రెబల్స్‌తో ​ట్రబుల్స్‌! | - | Sakshi
Sakshi News home page

రెబల్స్‌తో ​ట్రబుల్స్‌!

Dec 5 2025 3:28 PM | Updated on Dec 5 2025 3:28 PM

రెబల్స్‌తో ​ట్రబుల్స్‌!

రెబల్స్‌తో ​ట్రబుల్స్‌!

కాంగ్రెస్‌లో అసంతృప్తులు

బీఆర్‌ఎస్‌లోనూ అంతే..

సాక్షి,యాదాద్రి : ప్రధాన పార్టీలను రెబెల్స్‌ బెడద వెంటాడుతోంది. తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో చాలా చోట్ల అధికార కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ తరఫున నలుగురైదుగురు నామినేషన్‌ దాఖలు చేశారు. వారిలో కొందరు నామినేషన్‌ ఉపసంహరించుకోగా, మరికొందరు బరిలో ఉన్నారు. ఒకరి కంటే ఎక్కువ ఓట్లను చీల్చగలిగే తిరుగుబాటు అభ్యర్థులు ఉండటం ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది.

ప్రచారంలో జోరు పెంచిన అభ్యర్థులు

పల్లె పోరు వేడెక్కింది. తొలి విడత ఎన్నికలకు నేటి నుంచి ఆరు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. అనుచరులతో కలిసి ఇంటింటికి వెళ్లి తమ విజన్‌, సొంత మేనిఫెస్టోను వివరిస్తున్నారు. తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మొదటి విడతలో ఆలేరు,యాదగిరిగుట్ట, తుర్కపల్లి, రాజాపేట, బొమ్మలరామారం, ఆత్మకూర్‌(ఎం) మండలాల్లోని 153 గ్రామ పంచాయతీలు, 1,286 వార్డు స్థానాలున్నాయి. ఇందులో 16 పంచాయతీలు, 243 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. అవి పోను 137 పంచాయతీలు, 1,040 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఆయా చోట్ల అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

బరి నుంచి తప్పుకోవడానికి ససేమిరా..

ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ తరఫున కొన్ని చోట్ల ఒకరి కంటే ఎక్కువ మంది బరిలో ఉన్నారు. వారంతా పోటీపడి జనంలోకి వెళ్తున్నారు. తామంటే తామే ప్రధాన అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకోవడం ఆయా పార్టీలను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రచారం నుంచి తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నా ససేమిరా అంటున్నారు. పైగా కొందరు అభ్యర్థులు ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తిరిగి పార్టీలో చేరుతామని, పోటీ నుంచి మాత్రం ఉపసంహరించుకోబోమని స్పష్టం చేస్తున్నారు.

పొత్తు కుదిరినా పోటీలో..

యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు, ఆలేరు మండలం శర్భనాపురం గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్‌, సీపీఎం పొత్తు అనుకున్నారు. ఆలేరు ఎమ్మెల్యే సమక్షంలో రెండుచోట్ల సీపీఎంకు కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది. అయినా కాంగ్రెస్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన పలువురు సానుభూతి పరులు తమ నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. పెద్దకందుకూరులో సీపీఎం, కాంగ్రెస్‌ మద్దతుదారులు పోటీలో ఉన్నారు. ఇక శర్బనాపురంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బుగ్గ నవీన్‌కు బీజేపీ, సీపీఎం సీపీఐ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.

ప్రధాన పార్టీల తరఫున ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ

ఫ తామే అసలైన అభ్యర్థులమంటూ ఎవరికి వారే ప్రచారం

ఫ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో తలనొప్పులు

ఫ విజయావకాశాలపై ప్రభావం

ఫ రసవత్తరంగా పల్లె పోరు

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌లో నెలకొన్న అసంతృప్తి ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. రాజాపేట మండలం సో మారం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ అభ్యర్థులుగా శీలం జయంతి జగన్మోహన్‌రెడ్డి, గొలుసు అనూష, యాకుబ్‌ రెబెల్‌గా పోటీలో ఉన్నారు. బేగంపేట గ్రామ పంచాయతీలో జిల్ల బాలమణి భిక్షపతిగౌడ్‌. ఉస్తేపు జ్యోతికిరణ్‌, దూది వెంకటాపురంలో తుక్క ఏసుకుమార్‌, నడిమింటి నరేష్‌, ఎర్రోళ్లనరేష్‌, కొండ్రెడ్డిచెరువు పంచాయతీలో కర్రె శేఖర్‌, ఉప్పరి నరేష్‌. నమిల పంచాయతీలో పులి సత్యనారాయణ, పులిరాజు ఒకే పార్టీ తరఫున పోటీ పడుతున్నారు. యాదగిరిగుట్ట మండలం సైదాపురంలో కాల్నే సరిత, బత్తిని ధనలక్ష్మి, మల్లాపురంలో మంగ సత్యనారాయణ, కర్రె వీరయ్య, భూషాల్ల శ్రీనివాస్‌, చొల్లేరులో చిన్నం మమత, గడ్డమీది సంధ్య, మహబూబ్‌పేటలో ఆరె రమేష్‌, సామ వెంకటరెడ్డి.. వీరంతా కాంగ్రెస్‌ తరఫున పోటీలో ఉన్నారు. ఇక ఆలేరు మండలం రాఘవాపురం పంచాయతీలో బండ్ల శ్రీలత, తుంగ చంద్రకళ పోటీ చేస్తున్నారు. వీరిలో చంద్రకళ రెబెల్‌గా ఉన్నారు. తుర్కపల్లి మండలం గొల్లగూడెంలో కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరులు ధారవత్‌ మల్లేష్‌, దారావత్‌ రమేష్‌ ఇద్దరూ సర్పంచ్‌గా బరిలో ఉన్నారు.

బేగంపేటలో మంత్రాల అనూష సుమన్‌, గుండుకృప ప్రశాంత్‌, శర్బనాపురం గ్రామ పంచాయతీలో మొగులుగాని నరసయ్య, కందుల యాదమల్లయ్య పోటీ పడుతున్నారు. ఆత్మకూరు(ఎం) మండలం మోదుగుకుంటలో బీఆర్‌ఎస్‌ నుంచి సోలిపురం ఎల్లారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మామిడి మోహన్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. రెండు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపురం ఎల్లారెడ్డిని ఎమ్మెల్యే వద్దకు తీసుకెళ్లి కాంగ్రెస్‌ కండువా కప్పించుకొని ఏకగ్రీవం చేద్దామని కాంగ్రెస్‌ అభ్యర్థి మామిడి మోహన్‌రెడ్డి ఉపసంహరణ పత్రాలపై సంతకాలు చేయించారు. అనంతరం గ్రామానికి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థి మామిడి మోహన్‌రెడ్డి ఉపసంహరణ చేయకపోవడంతో ఆ గ్రామం నుంచి ఒకే పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు. మల్లాపురంలో, బీఆర్‌ఎస్‌ తరఫున కర్రె వెంకటయ్య, పల్లెపాటి మాధవి, మాసాయిపేటలో వాకిటి కిష్టయ్య, బుడిగే గౌతమి, పెద్ద కందుకూరులో మాజీ ఎంపీపీ గడ్డమీది స్వప్న, గుండ్లపల్లి మంగమ్మలు, బొమ్మలరామారం మండలం మర్యాల పంచాయతీలో సంగి రాజు, సందెగళ్ల పెద్దులు బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement