మొదట శాసనసభకు.. తర్వాత సర్పంచ్‌గా
ఫ నాలుగుసార్లు
ఎమ్మెల్యేగా పనిచేసి
సర్పంచ్‌గా ఎన్నిక
మోతె : ఎమ్మెల్యేగా నాలుగుసార్లు, సర్పంచ్‌గా ఒకసారి ఎన్నికై నా.. కుటుంబ పోషణకు కులవృత్తిని నమ్ముకున్న ఆదర్శ నేత ఉప్పల మల్సూర్. సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామానికి చెందిన ఉప్పల మల్సూర్ చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నారు. 20 ఏళ్ల వయసులోనే ప్రజా ఉద్యమాలు నిర్వహించారు. 1952లో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల్లో సీడీపీ, సీపీఎం అభ్యర్థిగా సూర్యాపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి నుంచి 1972 వరకు ఏకధాటిగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తన స్వగ్రామమైన సిరికొండలో కులవృత్తి అయిన చెప్పులు కుట్టే పనిచేస్తూ జీవనం సాగించారు. 1995లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామస్తులంతా ఏకమై ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ప్రతిపాదించారు. కానీ సీపీఎంపై ఉన్న అభిమానంతో ఆ పార్టీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచిన వ్యక్తిపై 700 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. సర్పంచ్‌గా పదవిలో ఉండగానే 1999లో ఆయన అనారోగ్యంతో మృతి చెందారు.


