ఓటేసిపోండి
అన్నా ఊరికి రండి..
తిరుమలగిరి (తుంగతుర్తి) : మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో సర్పంచ్, వార్డు స్థానాల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు వలస ఓటర్లపై దృష్టి పెట్టారు. ఓటర్లకు ఫోన్లు చేయడమే కాకుండా ప్రసన్నం చేసుకోవడానికి పట్నం బాట పట్టారు. వారిని పోలింగ్ రోజున రప్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఎవరెవరు వలస వెళ్లారు..
ఎక్కడెక్కడ ఉంటున్నారు..
ఈనెల 11న సూర్యాపేట జిల్లాలోని ఎనిమిది మండలాల్లో గల 159 గ్రామాలు, 1,442 వార్డులు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మండలాల్లో గల 153 పంచాయతీలు, 1286 వార్డులు, నల్లగొండ జిల్లాలోని 14 మండలాల్లో గల 318 పంచాయతీలు, 2870 వార్డులకు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామాల్లోని వారు ఉపాధి కోసం హైదరాబాద్, నిజామాబాద్, విజయవాడ, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఓటరు లిస్టు దగ్గర పెట్టుకొని ఎవరెవరు వలస వెళ్లారు. ఎక్కడెక్కడ ఉంటున్నారు. వారి ఫోన్‌నంబర్లు తెలుకొని వారిని కలిసేందుకు వెళ్తున్నారు. మీరు వస్తారా? లేదా డబ్బులు పంపమంటారా అనే విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. వాహనాలు ఏర్పాటు చేసుకొని వచ్చి ఓటేసి వెంటనే వెళ్లిపోతామని అందుకు అయ్యే ఖర్చులు భరించాలని కొందరు ఓటర్లు చెబుతున్నట్లు సమాచారం.
వారే కీలకం..
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడం, పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మరింత వేడెక్కింది. అభ్యర్థుల ఇళ్లలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లు ఎక్కడెక్కడ ఉన్నారనే సమాచార జాబితాను తయారు చేసి తమ వైపునకు తిప్పుకునేందుకు రూట్ల వారీగా ఒక్కో నాయకునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. హైదరాబాద్, భీమండి, నిజామాబాద్, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఓటర్లను తీసుకువచ్చేందుకు ప్రత్యేక ట్రావెల్ బస్సులు, కార్లను ముందస్తుగా బుక్ చేస్తున్నారు. పోలింగ్ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి వాహనాలు ఆలస్యం కాకుండా ముందస్తు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఓటింగ్ రోజు తప్పకుండా గ్రామానికి వచ్చి, తమకు ఓటు వేయాలని మెసేజ్‌లు పంపించి వేడుకుంటున్నారు. పలు గ్రామాలకు చెందిన నాయకులు ఇప్పటికే పట్నం బయలుదేరి ఊరి ఓటర్లు ఉన్న కాలనీలకు వెళ్లి సమావేశాలు ఏర్పాటు చేసి వారి మనస్సు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొంత మంది అభ్యర్థులు ఓటర్లను వ్యక్తిగతంగా కలిసి మద్దతు కోరుతున్నారు.
ఫ వలస ఓటర్లకు
గాలం వేస్తున్న అభ్యర్థులు
ఫ ప్రతి ఓటు కీలకం కావడంతో
ఫోన్లు చేసి నజరానాల ప్రకటన
ఫ వారిని ప్రసన్నం
చేసుకునేందుకు పట్నం బాట
ఓటర్లను ఆకర్షించేందుకు విందులు
గ్రామాల్లో ఓటర్లను ఆకట్టుకునే విధంగా విందు రాజకీయాలకు తెరలేపుతున్నారు. పట్నంలో ఉండే ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు అక్కడికి వెళ్లి దావత్‌లు సైతం ఇస్తున్నారు. ఒక్కో ఏరియాకు ఇన్‌చార్జిలను నియమించి పోలింగ్ రోజు తీసుకొచ్చే బాధ్యతను కూడా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో మినీ దావత్‌లు నడుస్తుండగా మరో రెండు రోజుల్లో విందులు మొదలు కానున్నాయి.


