ఆరోగ్యకరమైన నేలలే భవిష్యత్తుకు పునాది
గరిడేపల్లి : వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి నేలలోని సారాన్ని కాపాడుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 5న జరుపుకుంటారు. ఈ ఏడాది మృత్తిక దినోత్సవం థీమ్‌ని శ్రీఆరోగ్యకరమైన నేలలు–ఆరోగ్యకరమైన నగరాలకు పునాదిశ్రీగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఆహార భద్రత, నీటి నాణ్యత, పర్యావరణ స్థిరత్వాన్ని మెరుగుపర్చడంలో నేలలు కీలకపాత్ర పోషిస్తాయని ఈ థీమ్ తెలియజేస్తుంది. నగరాల్లో సైతం కాలుష్యాన్ని తగ్గించడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకించుకునే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పర్యావరణ స్థిరత్వాన్ని సాధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన నేలలు పట్టణ వ్యవసాయానికి దారి తీసి నగరాల్లో సైతం ఆహార లభ్యతను పెంచుతాయి. నేలల్లోని ఇతర జీవులు జీవవైవిధ్యాన్ని కాపాడతాయి. నేల నాణ్యత మెరుగైతే నీరు భూమిలోకి సులభంగా ఇంకి కాలుష్యం తగ్గుతుంది.
క్షీణిస్తున్న నేల నాణ్యత..
వ్యవసాయంలో ఎక్కువగా వాడుతున్న రసాయన ఎరువులు, అడ్డూ అదుపులేని నీటి వినియోగం, నేల క్రమక్షయం, సూక్ష్మపోషకాల కొరత వంటి సమస్యల వల్ల మట్టి నాణ్యత ప్రతి ఏడాది తగ్గిపోతుంది. ఇది భవిష్యత్తులో పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఆరోగ్యవంతమైన మట్టి పంటకు ఎక్కువ పోషకాలు అందిస్తుంది. నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. దీని వల్ల రసాయనాల వాడకం తగ్గి, రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గుతాయి.
రైతులు పాటించాల్సిన పద్ధతులు..
రైతులు పంటలు వేసే ముందు మట్టి పరీక్ష చేయించడం చాలా అవసరం. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మట్టి పరీక్ష చేయించాలి. పరీక్ష ఫలితాల ఆధారంగా లోపించిన పోషకాలకు తగ్గట్టు ఎరువులు వినియోగించాలి. అంతేకాకుండా సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం పెంచాలి. పశువుల ఎరువు, పచ్చి ఎరువు, కంపోస్టు ఎరువులు భూసార నాణ్యతను పెంచి, నేలలో సేంద్రియ పదార్థాల శాతాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా డ్రిప్, స్పింక్లర్లు ఉపయోగిస్తే నీటి ఆదా జరగడమే కాకుండా నేల క్రమక్షయం నివారించబడుతుంది. అదేవిధంగా పంట మార్పిడి కూడా నేల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వరి, కంది, పప్పు ధాన్యాలు వంటి పంటలను మారుస్తూ వేయడం వల్ల నేలకు విశ్రాంతి లభించి, పోషక సమతుల్యత మెరుగుపడుతుంది. పంట అవశేషాలను కాల్చకూడదు. అవశేషాలను నేలలో కలపడం ద్వారా నేలలో సేంద్రియ కర్బనం పెరిగి మట్టి, సూక్ష్మజీవులు రక్షించబడతాయి. మల్చింగ్ పద్ధతి ఉపయోగించడం మంచింది. నేలపై ఆకులు, గడ్డి వంటి పదార్థాలను కప్పడం వల్ల నేలలో తేమ నిల్వ ఉండి కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది. నేల క్షీణిస్తే పంటలే కాదు మానవ జీవన వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని గుర్తుంచుకోవాలి.
నేడు ప్రపంచ మృత్తిక దినోత్సవం


