గ్లోబల్ సమ్మిట్‌కు సూర్యాపేట వాసి
● పేరిణి నృత్య కళాకారుడు రాజ్‌కుమార్ బృందానికి ఆహ్వానం
సూర్యాపేటటౌన్ : రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. సమ్మిట్ ప్రారంభోత్సవానికి ముందు పేరిణి నాట్యం ద్వారా స్వాగతం పలికేందుకు సూర్యాపేటకు చెందిన డ్యాన్స్ మాస్టర్ పేరిణి రాజ్‌కుమార్‌కు ఆహ్వానం అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద కంపెనీల సీఈఓలు నెల 7వ తేదీన సాయంత్రం శిల్పారామానికి రానుండడంతో వారికి పేరిణి నాట్యంతో స్వాగతం పలకనున్నట్లు పేరిణి రాజ్‌కుమార్ తెలిపారు. 8న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి స్వాగతంతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
జాతీయ రహదారిపై తనిఖీలు ముమ్మరం
చౌటుప్పల్ రూరల్: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జాతీయ రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. చౌటుప్పల్ మండల పరిధిలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద, తుప్రాన్‌పేట గ్రామ శివారులో పోలీసులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు.
ఎన్నికల ప్రచార వాహనం సీజ్
యాదగిరిగుట్ట రూరల్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం గ్రామ శివారులో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. మల్లాపురం బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి కర్రె వెంకటయ్య ప్రచార వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా అందులో కర్రె లింగస్వామి అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. మద్యంతోపాటు, వాహనాన్ని సీజ్ చేసి, వారిపై కేసు నమోదు చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు.


