పల్లెలకు సిద్ధమైన శ్రీనృసింహుడి రథం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రచార రథం పల్లెలకు వెళ్లేందుకు సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులకు నోచుకోని శ్రీస్వామి వారి ప్రచార రథాన్ని ఆలయ ఈఓ వెంకట్రావ్ బాగుచేయించి, పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. రాష్ట్రంలోని ఆయా గ్రామాలు, పట్టణాల్లో శ్రీస్వామి వారి కల్యాణోత్సవంతో పాటు ఆలయ విశిష్టతను ప్రచారం చేసేందుకు ఈ రథాన్ని వినియోగించనున్నట్లు ఆలయ ఈఓ వెంకట్రావ్ గురువారం వెల్లడించారు. ఈ నెల మూడవ, నాల్గవ వారంలో భూపాలపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రచార రథం ద్వారా శ్రీస్వామి వారి ఆశీస్సులు భక్తులకు అందజేసే కార్యక్రమంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భూపాలపల్లిలో జరిగే శ్రీస్వామి కల్యాణోత్సవానికి ఏఈఓ నవీన్, నాగర్‌కర్నూల్‌లో నిర్వహించే కల్యాణానికి ఏఈఓ రఘులను నోడల్ అధికారులుగా ఈఓ నియమించారు. దశల వారీగా వివిధ ప్రాంతాల్లో స్వామివారి ప్రచార రథాన్ని పంపి, ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


