వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
భువనగిరిటౌన్ : అంతర్జాతీయ వయో వృద్ధుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. వారోత్సవాల పోస్టర్‌ను శనివారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. అనంతరం సీనియర్ సిటిజన్స్‌తో సమావేశం నిర్వహించి మాట్లాడారు. వృద్ధుల చట్టాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశం నర్సింగరావు, సభ్యులు భిక్షపతిరెడ్డి, సత్యనారాయణ, రోమన్, ఆరోగ్యయ్య, అంజయ్య, బాలేశం, రవీందర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
భూదాన్‌పోచంపల్లి: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 20న హైదరాబాద్‌లోని హ్యాండ్లూమ్ కమిషనర్ కార్యాలయం ఎదుట తలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ చేనేత జన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చింతకింది రమేశ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిందంటూ శనివారం భూదాన్‌పోచంపల్లిలోని నేతన్న విగ్రహం వద్ద చేనేత నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రుణమాఫీ ప్రకటించి 14నెలలు అవుతున్నా నేటికీ అమలు కాలేదన్నారు. త్రిఫ్ట్, నేతన్న భరోసా తదితర పథకాలను అమలు చేయాలని, చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, పేరుకుపోయిన వస్త్రాలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు కర్నాటి పురుషోత్తం, నాయకులు వేశాల మురళి, ఆటిపాముల మహేందర్, జోగు శ్రీనివాస్, వడ్డేపల్లి విష్ణు తదితరులు పాల్గొన్నారు.
23వ తేదీన
ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష
భువనగిరి : ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎంఎస్) టెస్ట్‌ను ఈ నెల 23న నిర్వహించనున్నట్లు డీఈఓ సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
ముమ్మరంగా ఎంఎంటీఎస్ పనులు
భువనగిరిటౌన్ : ఎంఎంటీఎస్ పనులు భువనగిరి పట్టణ పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రైల్వేట్రాక్ పక్క నుంచి పనులు జరుగుతున్నాయి. ఘట్‌కేసర్ నుంచి యాదగిరి గుట్ట మండలం వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ విస్తరిస్తున్నారు. సుమారు 41 కిలో మీటర్ల మేర రూ.412 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎంటీఎస్ పనులు చేపట్టారు.


