సార్.. మాకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు
మోటకొండూర్ : సార్.. మేము ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేశాం.. అధికారులు మంజూరు చేయలేదు.. మాది నిరుపేద కుటుంబం.. ఇల్లు ఇవ్వండి అని ఓ విద్యార్థి కలెక్టర్‌ను కోరాడు. మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శనివారం కలెక్టర్ హనుమంతరావు పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించి భోజన నాణ్యత, బోధన తీరుపై తెలుసుకున్నారు. ఈ క్రమంలో కీర్తికుమార్ అనే విద్యార్థి తాము ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదని కలెక్టర్‌ను ధైర్యంగా అడిగాడు. వెంటనే ఎంపీడీఓతో కలెక్టర్ మాట్లాడి ఆరా తీయగా.. గ్రామంలో స్థలం లేకపోవడంతో ఇల్లు మంజూరు కాలేదని తెలిపారు. విద్యార్థి ధైర్యాన్ని చూసి అతన్ని కలెక్టర్ అభినందించారు. ప్రతి విద్యార్థి ధైర్యంగా ప్రశ్నించేతత్వం అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. అంతకుముందు మధ్యహ్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట హెచ్‌ఎం మహ్మద్ గఫార్, ఉపాధ్యాయులు జయంత, పాండురంగం, నాగరాజు, పుష్పలత ఉన్నారు.
ఫ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన విద్యార్థి
ఫ అతని ధైర్యానికి మెచ్చుకున్న కలెక్టర్


