ఒక్క రోజే 1,199 కేసులు పరిష్కారం
భువనగిరిటౌన్ : జాతీయ లోక్ అదాలత్‌కు జిల్లాలో భారీ స్పందన లభించింది. శనివారం ఒక్క రోజే 1,199 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇందులో క్రిమినల్ 1,181, సివిల్ 2, సైబర్ క్రైం, ప్రిలిటిగేషన్ కేసులు 16 ఉన్నాయి. జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రత్యేకంగా 8 బెంచ్‌లు ఏర్పాటు చేసి రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. కక్షిదారులకు సూచనలు, న్యాయ సలహాలు ఇవ్వడానికి హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయరాజు మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.
లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం
కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్‌లో ఎంతగానో దోహడపడుతాయని జిల్లా ప్రధాన జడ్జి జయరాజు పేర్కొన్నారు. భువనగిరి కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను ప్రారంభించి మాట్లాడారు. రాజీకి ఆమోదయోగ్యమైన కేసులు పరిష్కరించుకొన ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని, కుటుంబ శ్రేయస్సుకు, ఆర్థిక ప్రగతికి తోడ్పడాలని కక్షిదారులకు సూచించారు. కేసుల పరిష్కారానికి చొరవచూపిన న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి మాధవిలత, మొదటి అదనపు జిల్లా జడ్జి ముక్తిదా, పోక్సో కోర్టు ప్రత్యేక అదనపు జిల్లా జడ్జి మిలింద్‌కాంబ్లె, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్యాంసుందర్, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి జి.స్వాతి, లోక్ అదాలత్ సభ్యులు కె.గోపాల్‌రావు, రాజశేఖర్‌రెడ్డి, మట్ట వెంకటేశం, పోలీసు అధికారులు, కోర్టుల సిబ్బంది పాల్గొన్నారు.
ఫ జాతీయ లోక్ అదాలత్‌కు భారీ స్పందన
ఫ కేసుల పరిష్కారానికి ప్రత్యేకంగా ఎనిమిది బెంచ్‌లు ఏర్పాటు


