విద్యుత్ శాఖ.. ప్రజాబాట
ఫ వారంలో మూడు రోజులు
వినియోగదారులతో ప్రత్యేక సమావేశాలు
ఫ తొలుత పట్టణాల్లో ప్రజాబాట
ఫ సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణ
ఫ అక్కడికక్కడే పరిష్కారం
భువనగిరి: ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి కరెంట్ సరఫరా పునరుద్ధరణకు సమయం పడుతోంది. ఈ క్రమంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్‌పెట్టి, నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే లక్ష్యంతో విద్యుత్ అధికారులు ప్రజాబాట పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తొలుత పట్టణాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
మంగళ, గురు, శనివారం రోజుల్లో..
వారంలో మూడు రోజులు (మంగళ, గురు, శనివా రం) ప్రజాబాట నిర్వహిస్తున్నారు. విద్యుత్ అధికారులు, సిబ్బంది పట్టణాల్లో పర్యటించి ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. సమస్యలను తెలుసుకొని తక్కువ ఖర్చుతో కూడుకున్న వాటిని అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. ఎక్కువ వ్యయంతో కూడుకున్న పనులకు ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులే కాకుండా ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద చెట్ల పొదలు, తీగ జాతి చెట్లను తొలగిస్తున్నారు. ఇనుప స్తంభాలను గుర్తిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, లో ఓల్టేజీ సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. వర్షాలు వచ్చినప్పుడు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడితే జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నారు.
అందుబాటులో 1912
విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినా, సమస్యలు తలెత్తినా ఫిర్యాదు చేయడానికి వినియోగదారుల సౌకర్యార్థం ఫ్యూజ్ ఆఫ్ కాల్ నంబర్ 1912 ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌పైనా ప్రజాబాటలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. విద్యుత్ ప్రమాదాలపైనా వివరిస్తున్నారు.
విద్యుత్ స్తంభం వద్ద చెట్లనుతొలగిస్తున్న సిబ్బంది
సమస్యలను గుర్తించి నమోదు చేసుకుంటున్న విద్యుత్ అధికారులు, సిబ్బంది
వినయోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యం. ఇందులో భాగంగా ప్రజాబాట పేరుతో సమస్యలను గుర్తించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించే దిశగా అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. ఎక్కువ ఖర్చుతో కూడిన వాటికి ఉన్నత అధికారులకు ప్రతిపాదనలు పంపుతున్నాం. నిధులు రాగానే వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటాం.
–సుధీర్‌కుమార్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ
విద్యుత్ శాఖ.. ప్రజాబాట


