నేడు ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి
భువనగిరి టౌన్: కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి కార్యక్రమం గురువారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, ఉద్యోగుల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించనున్నామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలను అర్చకులు ఆగమశాస్త్రం ప్రకారం నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువజామున ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు.. స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలో కొలువైన స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం, తులసీదళ అర్చన గావించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు చేశారు. అదే విధంగా శివాలయంలో రుద్రాభిషేకం, బిల్వార్చన, కార్తీక దీపారాధన, స్పటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
నేటి నుంచి గురుకుల జోనల్‌స్థాయి క్రీడా పోటీలు
రాజాపేట: 11వ జోనల్ స్థాయి గురుకుల క్రీడా పోటీలకు రాజాపేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సిద్ధమైంది. నేటి నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రీడా పోటీలు జరగనున్నాయి. 13 గురుకుల విద్యాలయాల నుంచి విద్యార్థులు క్రీడాపోటీల్లో పాల్గొంటారని జోనల్ అధికారి అరుణకుమారి, యాదాద్రి, జనగామ జిల్లాల డీసీఓలు సుధాకర్, శ్రీనివాసరావు తెలిపారు. కబడ్డీ, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, బాల్‌బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, ఖోఖో, క్యారమ్స్, చెస్, అథ్లెటిక్స్‌లో పోటీలు ఉంటాయని, వీటి నిర్వహణకు కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో గురుకుల విద్యాలయాల స్పోర్ట్స్ ఆఫీసర్ రుతుమణి, జోనల్ స్పోర్ట్స్ ఇంచార్జ్ శ్రీనివాస్, పీడీలు కిషన్, వెంకటేశ్వర్లు, పీఈటీ శృతి పాల్గొన్నారు.
కొత రూల్స్‌పై ఎందుకు ప్రశ్నించడం లేదు?
భువనగిరిటౌన్ : ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని కేంద్రం తీసుకువచ్చిన నిబంధనతో రైతులు తీవ్రంగా నష్టపోతారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య అన్నారు. బుధవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నరసింహ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన నిబంధనపై కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ జిల్లాలోని రహదారులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బట్టుపల్లి అ నురాధ, బాలరాజు, కల్లూరి మల్లేశం, పాండు, జెల్లెల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణి


