విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిద్ధం
వారంలో పరిష్కారం
ఆలేరు: విద్యుత్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ‘డిస్కం’ సిద్ధమైంది. శాఖపై నమ్మకాన్ని మరింత పెంచుతూ.. వినియోగదారులకు విద్యుత్ సేవలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. ఇందుకు విద్యుత్ సమస్యలపై ఎక్కడికి వెళ్లాలో.. ఎవరిని కలవాలో తెలియక ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు సత్వర సేవలు అందించేందుకు అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (టీఎస్‌ఈఆర్‌సీ) ఆవిర్భావాన్ని పురస్కరించుకొని జిల్లాలోని భువనగిరి, చౌటుప్పల్ విద్యుత్ డివిజన్‌ల పరిధిలో సోమవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవ వేదిక నిర్వహిస్తున్నారు. ఈమేరకు ఆయా డివిజన్ల పరిధిలోని డీఈలు, ఏడీఈ,ఏఈలకు జిల్లా అధికారులు ఆదేశాలిచ్చారు. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం చాలా కాలంగా నిరీక్షిస్తూ విసిగిపోయిన వినియోగదారులకు ఈవేదిక ద్వారా ఊరట లభించనుంది.
సిబ్బంది ఇబ్బంది పెట్టినా..
జిల్లా వ్యాప్తంగా సోమవారం జరుగనున్న ఈ కార్యక్రమంలో రైతులు, ఇతర విద్యుత్ వినియోగదారుల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించనున్నారు. సమస్యలపైనే కాకుండా క్షేత్రస్థాయిలో సిబ్బంది, అధికారి ఎవరైనా ఇబ్బంది పెట్టినా, డబ్బులు అడిగినా వినియోగదారులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఈ సమస్యలకు ప్రాధాన్యం
కొత్త విద్యుత్ మీటర్ ఏర్పాటు, పాత విద్యుత్ మీటరు మార్పు, రీడింగ్‌లో పొరపాట్లు, విద్యుత్ బిల్లులు ఎక్కువగా రావడం, కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను మార్చడం తదితర సమస్యలపై చాలా మంది వినియోగదారులకు ఎక్కడ ఫిర్యాదు చేయాలో తెలియదు. కొంతమంది లైన్‌మెన్‌లకు చెప్పినా పరిష్కారంలో జాప్యం జరుగుతుంది. ఏఈలు ఎవరో తెలియదు. అలాంటి వారికి విద్యుత్ దినోత్సవ వేదిక ద్వారా అవకాశం కల్పించి, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోనున్నారు.
పలు అంశాలపై అవగాహన..
విద్యుత్ పొదుపునకు పాటించాల్సిన అంశాలు, నాణ్యమైన పంపుసెట్లు, రాపిడి లేని ఫుట్ వాల్వ్‌లు, పైప్‌లు, కెపాసిటర్ల వాడకంపై, విద్యుత్ ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.
విద్యుత్‌ౖ లెన్ల షిఫ్టింగ్..
రోడ్డు, దారి మధ్యలో విద్యుత్ స్తంభాలను తొలగించుట. ప్రజలకు అసౌకర్యం, ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల షిఫ్టింగ్‌పై వచ్చే వినతులను పరిష్కరించనున్నారు. ఒకవేళ అవి వ్యక్తిగతమైనవి అయితే సదరు వ్యక్తులు విద్యుత్ లైన్, ట్రాన్స్‌ఫార్మర్‌ల షిఫ్టింగ్‌కు నిర్దేశించిన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
అంబుడ్స్‌మెన్‌కు ఫిర్యాదు చేయొచ్చు
విద్యుత్ వినియోగదారుల దినోత్సవంలో వినతిపత్రం ఇచ్చినా సమస్య పరిష్కారం కాకపోతే కన్జూమర్ గ్రీవెన్స్ రీడ్రెసల్ ఫోరం(సీజీఆర్‌ఎఫ్)లో తెలపాలి. అక్కడా ఫలితం రాకపోతే వినియోగదారులు అంబుడ్స్‌మెన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేయొచ్చని అధికారులు చెబుతున్నారు. సమస్యలపై సీజీఆర్‌ఎఫ్‌లో ఫిర్యాదు చేయడానికి వినియోగదారులు 040–23431432 నంబర్‌ను సంప్రదించాలి.
ఫ భువనగిరి, చౌటుప్పల్ డివిజన్‌లో
నేడు విద్యుత్ వినియోగదారుల దినోత్సవ వేదిక
ఫ వినతుల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి
విద్యుత్ దినోత్సవం కార్యక్రమంలో విద్యుత్ సమస్యలపై వినియోగదారుల సమర్పించిన వినతులు, ఫిర్యాదులను పరిశీలిస్తాం. జాప్యానికి కారణాలు తెలుసుకొని, సిబ్బంది పొరపాటు ఉంటే మందలిస్తాం. ఆయా వినతులు, ఫిర్యాదులను వారంలో పరిష్కరించేలా అధికారులకు సూచనలు ఇస్తాం. సోమవారం విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా అధికారులు, అన్ని స్థాయిల సిబ్బంది వినియోగదారులకు అందుబాటులో ఉంటారు. – సుధీర్‌కుమార్,
ఎస్‌ఈ, యాదాద్రి భువనగిరి జిల్లా
విద్యుత్ సమస్యల పరిష్కారానికి సిద్ధం


