నేడు మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం
వలిగొండ : మండలంలోని వెంకటాపురంలో గల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ద్వారతోరణం, ధ్వజకుంభ ఆరాధన, మూర్తి కుంభ ఆరాధన, చతుస్నానార్చన, నిత్యహోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం కళాకారులు నృత్య ప్రదర్శనతో హనుమత్ వాహనాన్ని మాడవీధుల్లో ఊరేగించారు. సోమవారం స్వామివారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి మోహనబాబు, ఆలయ కమిటీ చైర్మన్ నరేష్ కుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
నేటి నుంచి సురేంద్రపురిలో
కార్తీక మాస బ్రహ్మోత్సవాలు
భువనగిరి: సురేంద్రపురి పంచముఖ హనుమదీశ్వర దేవస్థానంలో సోమవారం నుంచి కార్తీక మాసం బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నట్లు ఆలయ మేనేజర్ నరసింహరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 3న ఉదయం విఘ్నేశ్వర పూజ, నాగేశ్వర మూలమత్ర హోమం, నవగహ్ర హోమం, అకాశదీపారాధన, 4న అలివేలుమంగ, పద్మావతి సహిత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం, శేషవాహన సేవ, 5న పంచముఖ పరమేశ్వర మూలమూర్తికి పంచామృత నిజాభిషేకం, రుద్రహోమం, పంచముఖ హనుమదీశ్వర సంయుక్త మహామూర్తుల పాదాలకు అష్టోత్తర శత కలశాలతో క్షీరాభిషేకం, సామూహిక సత్యనారాయణ వ్రతం, కుంభసంప్రోక్షణ, కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
స్వర్ణగిరి క్షేత్రంలో
తులసీ కల్యాణం
భువనగిరి: పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం కార్తీక శుద్ధ ద్వాదశి వేడుకల్లో భాగంగా వైభవంగా తులసీ కళ్యాణం నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, తోమాల సేవ, సహస్రనామార్చన సేవ, నిత్య కల్యాణ మహోత్సవం జరిపించారు. మధ్యాహ్నం సుమారు 5వేల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
మానవీయ విలువల
సమాహారం బైరెడ్డి కవిత్వం
నల్లగొండ : మానవీయ విలువలు బైరెడ్డి కృష్ణారెడ్డి కవిత్వమని సాహితీవేత్త ప్రసేన్ అన్నారు. నల్లగొండలో ఆదివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సుంకిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన కృష్ణారెడ్డి రాసిన ది అన్ ఫేడింగ్ అన్ ఫోల్డ్ అనే ఆంగ్ల గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కృష్ణారెడ్డి రాసిన ఆర్తి 5వ సంపుటాన్ని కథా రచయిత మేరెడ్డి యాదగిరిరెడ్డి ఆవిష్కరించారు. ఆర్తి కవిత్వంపై ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ సీతారాం, డాక్టర్ కోయి కోటేశ్వరరావు, పగడాల నాగేందర్ మాట్లాడారు. ది ఆన్ పెండింగ్ అన్ ఫోల్డ్ గ్రంథంపై సతీష్ బైరెడ్డి, డాక్టర్ ఎం.రాంభాస్కరరాజు, దొన్నగంటి కృష్ణ విశ్లేషించారు. అనంతరం జరిగిన సాహితీ మిత్రుల చర్చ గోష్టికి డాక్టర్ తండు కృష్ణ కౌండిన్య అధ్యక్షత వహించారు. ఆర్తి కవిత్వంపై చర్చను మునాసు వెంకట్, ఆంగ్ల గ్రంథంపై చర్చను డాక్టర్ నోముల రాహుల్ నిర్వహించారు. సమన్వయకర్తలుగా డాక్టర్ సాగర్ల సత్తయ్య, బండారు శంకర్ వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంవి.గోనారెడ్డి, అంబటి వెంకన్న, చకోనా, ఎలికట్టె శంకర్‌రావు, పెరుమాళ్ల ఆనంద్, నోముల రజనీష్, రాహుల్, పెద్దిరెడ్డి గణేష్, శీల అవిలేను, మధుసూదన్, రాజేశ్వర శాస్త్రి పాల్గొన్నారు.
నేడు మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి కల్యాణం


