శోకసంద్రంలో అనూషారెడ్డి కుటుంబం
గుండాల: కర్నూలు జిల్లాలో జరిగిన ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన గుండాల మండలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన మహేశ్వరం అనూషారెడ్డి ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహేశ్వరం విజిత, శ్రీనివాస్‌రెడ్డి దంపతులకు ఇద్దరు కూతుర్లే కావడంతో అల్లారు ముద్దుగా పెంచి ఉన్నత చదువులు చదివించారని బంధువులు పేర్కొన్నారు. కూతుర్లే అండగా ఉంటారని ఆశించిన తమకు దేవుడు ఇంత పెద్ద శిక్ష వేశాడని అనూషారెడ్డి తల్లిదండ్రులు విలపించారు. చిన్నతనం నుంచి అనూషారెడ్డి తన తెలివితేటలతో తమకు వారసుడు లేడన్న ఆలోచన లేకుండా చేసిందని విలపిస్తున్న తీరును చూసి బంధువులు కంటతడి పెట్టారు. కాగా కాలిపోయిన మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. మృతదేహాన్ని 48 గంటల తర్వాత కుటుంబ సభ్యులకు అందజేస్తామని అధికారులు తెలిపినట్లు బంధువులు చెప్పారు.
ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి ఆత్మహత్య
యాదగిరిగుట్ట రూరల్: ఆర్థిక ఇబ్బందులతో రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతం ఆదిత్య నగర్‌లో నివాసముంటున్న లింగాల భానుప్రకాష్(30)కు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రసన్నతో వివాహం జరిగింది. భానుప్రకాష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురై స్కూటీపై ఇంటి నుంచి బయల్దేరి వరంగల్–హైదరాబాద్ జాతీయ రహదారిలో రైల్వే ట్రాక్ ప్రక్కన స్కూటీని ఉంచి, శుక్రవారం అర్ధరాత్రి ఆలేరు–వంగపల్లి రైల్వే స్టేషన్‌ల మధ్య రైలు కింద పడి ఆత్మహాత్య చేసుకున్నాడు. శనివారం రైల్వే మృతదేహాన్ని గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


