31న యువజనోత్సవాలు
భువనగిరి : ఈ నెల 31న జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి కె.ధనుంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాదరగిరిగుట్టలోని స్కిల్ డవెలప్‌మెంట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు డిక్లమేషన్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. నవంబర్ 4న ఉదయం 9 గంటలకు భువనగిరి కోట వద్ద ఫోక్ డ్యాన్స్, ఫోక్‌సాంగ్ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పోటీల్లో పాల్గొనేవారు 15 సంవత్సరాల వయస్సు పైబడి 29 సంవత్సరాలలోపు ఉండాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సెల్ :8309992451, 8374333378 నంబర్లను సంప్రదించాలని కోరారు.
కల్తీ ఆహార పదార్థాలు
విక్రయిస్తే కేసులు
రాజాపేట : నాణ్యత లోపించిన, కల్తీ ఆహార పదార్థాలు విక్రయించినా కేసులు తప్పవని జిల్లా తూనికలు, కొలతల అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం రాజాపేట మండల కేంద్రంలోని కిరాణం షాపులు, జ్యూవెలరీ, రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్యాకింగ్ చేసి విక్రయిస్తున్న ఆహార పదార్థాల గడువు, కంపెనీల వివరాలు, తూకం వేసే మిషన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువు దాటిన వస్తువులు, గుర్తింపులేని కంపెనీల పదార్ధాలను విక్రయించొద్దన్నారు. ఆయన వెంట సిబ్బంది, ఆయా షాపుల యజమానులు ఉన్నారు.
ముగిసిన
తిరునక్షత్ర వేడుకలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మనవాళ మహాముని తిరునక్షత్ర వేడుకలు సోమవారం ముగిశాయి. గత రెండు రోజులుగా ఆలయంలో మహాముని తిరునక్షత్ర వేడుకలు కొనసాగాయి. సాయంత్రం వేళ శ్రీస్వామి వారి సేవతో పాటు ఆళ్వారుల సేవను ఆలయ తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు. తిరువీధిలో పురఫ్పాట్ సేవను ఊరేగిస్తూ, ప్రబంధ పాశురాలను ఆలయ పారాయణీకులు, అర్చకులు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ ప్రధానార్చకులు సురేంద్రచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.
శివకేశవులకు విశేష పూజలు
యాదగిరిగుట్ట : శివ కేశవులు కొలువున్న యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. కొండపైన యాదగిరీశుడి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివుడికి, స్పటిక లింగానికి పూజారులు రుద్రాభిషేకం, బిల్వార్చన పూజలు నిర్వహించారు. ఇక ప్రధానాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సంప్రదాయ పూజలను కొనసాగించారు.
క్షేత్రస్థాయిలో
పరిశీలన చేయాలి
భువనగిరి : జిల్లా స్థాయిలో 5, 4 స్టార్ పొందిన పాఠశాలలను భౌతికంగా క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. సోమవారం రాయగిరి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్, సీనియర్ ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాల ప్రకారం ఎంపిక చేసిన పాఠశాలల్లో పక్కాగా పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో సెక్టోరియల్ అధికారి పెసరు లింగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ అండాలు, శిక్షకులు శ్రీనివాస్, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
31న యువజనోత్సవాలు
31న యువజనోత్సవాలు


