పోచంపల్లిలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లిలో శనివారం ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు సందడి చేశారు. హైదరాబాద్‌లోని హామ్‌స్టక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రియేటిక్ టెక్నాలజీకి చెందిన 42 మంది విద్యార్థులు స్థానిక టూరిజం పార్కును సందర్శించారు. అక్కడ ఇక్కత్ ప్రాముఖ్యతను తెలియజెప్పే ఏవీని తిలకించారు. అనంతరం మగ్గాలు, ఆసు యంత్రం, చిటికి కట్టడం, ఇక్కత్ చేనేత వస్త్రాలు, డిజైనింగ్‌ను పరిశీలించారు. ఇక్కత్ వస్త్రాల తయారీ విధానం, వాటి ప్రాముఖ్యత, కార్మికులకు లభిస్తున్న గిట్టుబాటు ధర తదితర విషయాలను చేనేత కళాకారుడు భారత ప్రవీణ్ వారికి వివరించారు. అనంతరం కళాశాల టెక్స్‌టైల్ ఫ్యాకల్టీ సౌజన్య మాట్లాడుతూ.. ఫ్యాషన్ డిజైనింగ్, స్టైలిష్, ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా చేనేత కార్మికుల జీవన స్థితిగతులు, ఇక్కత్ వస్త్రాల ప్రాముఖ్యత, వారు అవలంబిస్తున్న సాంప్రదాయ విధానాలు, కళాకారుల శ్రమ విలువను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి పోచంపల్లికి వచ్చారని తెలిపారు. వారి వెంట మార్కెటింగ్ ఫ్యాకల్టీ దివ్యలక్ష్మి, క్యాడ్ ఫ్యాకల్టీ ప్రతిమ ఉన్నారు.
పోచంపల్లిలో ఫ్యాషన్ డిజైనింగ్ విద్యార్థులు


