మిర్యాలగూడ డిపో బస్సుకు ఏపీలో ప్రమాదం
మిర్యాలగూడ టౌన్: మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద శనివారం జరిగింది. వివరాలు.. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు దాచేపల్లికి వెళ్తుండగా మార్గమధ్యలో దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బస్సు లారీకి వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో డ్రైవర్ గోనానాయక్, కండక్టర్ వి. లింగయ్య, ప్రయాణికులు ఎస్. రవి, మంజుల, ధనమ్మ, సంతోషం, దేవసాయం, రజనిబాయి, నజీమా, రిజ్వానాకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గురజాల, దాచేపల్లిలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ డిపో మేనేజర్ రాంమోహన్‌రెడ్డి, సేఫ్టీ వార్డెన్ శ్రీనివాస్, టీఐ– నాగమణి, సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ జానకిరాంరెడ్డి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రయాణికులను పరామర్శించారు. ఈ మేరకు దాచేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన
పల్లె వెలుగు బస్సు
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం
శ్రీనగర్ వద్ద ఘటన


