పర్యాటకుల భద్రతకు భరోసా..
భూదాన్‌పోచంపల్లి: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలకు ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిస్టు పోలీసులను నియమించింది. పర్యాటకులకు మెరుగైన భద్రత, ఆతిథ్యం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు, ఆర్కియాలజీల్లో విధులు నిర్వహించేలా 80 మంది పోలీసులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చింది. అందులో యాదాద్రి జిల్లాలోని భూదాన్‌పోచంపల్లికి ఐదుగురు, యాదగిరిగుట్టకు ఆరుగురు, భువనగిరి ఖిలాకు నలుగురు చొప్పున మొత్తం 15 మందిని నియమించింది. వీరంతా వారం రోజుల క్రితం విధుల్లో చేరారు. పర్యాటక ప్రాంతాల్లోనే విధులు నిర్వరిస్తున్నారు.
షిఫ్ట్‌ల వారీగా విధులు
భూదాన్‌పోచంపల్లిలోని టూరిజం పార్కులో ఇప్పటి వరకు కేవలం టూరిజం మేనేజర్, సిబ్బంది మాత్రమే ఉండేవారు. తాజాగా పోలీసులు కూడా చేరారు. టూరిజం పోలీసులు ప్రత్యేకంగా షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు. టూరిజంశాఖ, పోలీస్ శాఖ సంయుక్త పర్యవేక్షణలో వీరు పనిచేస్తారు. టూరిజం పోలీసుల రాకతో పర్యాటక కేంద్రాల పరిసరాల్లో అసాంఘిక కార్యక్రమాలకు చెక్ పడనుందని స్థానికులు అంటున్నారు. కాగా భూదాన్‌పోచంపల్లికి కేటాయించిన టూరిజం పోలీసుల్లో రాజశేఖర్, ప్రవీణ్‌రెడ్డి, భవానీ, జాహ్నవి, లావణ్య ఉన్నారు.
ఫ జిల్లాకు 15 మంది టూరిస్టు పోలీసుల నియామకం
ఫ పర్యాటక ప్రాంతాల్లో భద్రత వీరి డ్యూటీ


