నిరుపయోగంగా డ్రయ్యర్‌లు !
చౌటుప్పల్: తడిసిన, తేమ అధికంగా ఉన్న వరి ధాన్యాన్ని ఎండబెట్టేందుకు గాను చౌటుప్పల్, వలిగొండ వ్యవసాయ మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే యంత్రాలను(డ్రయ్యర్‌లు) యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్ సమకూర్చారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక్కో దానికి రూ.14.90లక్షలు వెచ్చించి ఈ ఏడాది మే నెలలో కొనుగోలు చేసి మార్కెట్ యార్డులకు పంపించారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో ఈ యంత్రం సాయంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవచ్చు. అయితే ఆయా మార్కెట్ యార్డులలో ఉన్న ఈ యంత్రాలను ఇప్పటివరకు ఒక్క రైతు కూడా వినియోగించుకోలేదు.
ట్రాక్టర్ ధాన్యానికి రూ.4000 ఖర్చు..
ఈ డ్రైయింగ్ మిషన్ ద్వారా ధాన్యం ఆరబెట్టుకోవడం రైతులకు పెను భారంగా మారింది. ఒక్కో ట్రాక్టర్ ధాన్యం(సుమారు 24 క్వింటాళ్లు) ఆరబెట్టేందుకు సుమారుగా రెండు గంటల సమయం పడుతోంది. ఈ యంత్రాన్ని నడిపించేందుకు ప్రత్యేకంగా ట్రాక్టర్ కావాల్సి ఉంది. ధాన్యం ఆరబెట్టుకోవాలంటే ట్రాక్టర్‌తో పాటు డ్రయ్యర్‌కు 10లీటర్ల చొప్పున డీజిల్ అవసరం అవుతుంది. రెండు గంటల సమయంలో ఒక ట్రాక్టర్ ధాన్యం మాత్రమే ఆరబెట్టే అవకాశం ఉంది. అలా ఒక్కో ట్రాక్టర్ ధాన్యం ఆరబెట్టేందుకు గాను రైతుకు సుమారుగా అన్ని ఖర్చులు కలిపి రూ.4000కు పైగానే అవుతుండడంతో ఈ యంత్రాన్ని వినియోగించుకునేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడంలేదు.
మార్కెట్ యార్డులోనే యంత్రం
డ్రయ్యర్ వినియోగించకపోవడంతో ప్రస్తుతం చౌటుప్పల్ మార్కెట్ యార్డులో నిరుపయోగంగా ఉంది. ఈ విషయాన్ని మార్కెట్ అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిరుపయోగంగా ఉన్నందున వేరే చోటుకై నా తీసుకెళ్లాలని కోరారు. అయితే ఆ యంత్రాల వినియోగానికి అయ్యే ఖర్చు మార్కెట్ నుంచి భరించాలని ఉన్నతాధికారులు సూచించారు. దీంతో ఆ ఖర్చులు భరించలేమని పాలకవర్గం, అధికారులు చేతులెత్తేశారు. అటు రైతులు ముందుకు రాక, మరోవైపు అధికారులు స్పందించక చివరికి ఆ డ్రయ్యర్‌లు నిరుపయోగంగా మారాయి.
చౌటుప్పల్, రామన్నపేట మార్కెట్ యార్డులకు ధాన్యం ఆరబెట్టే
యంత్రాలు సమకూర్చిన మార్కెటింగ్ శాఖ
రెండు గంటల పాటు
వినియోగించడానికి రూ.4000 ఖర్చు
ఆర్థిక భారంతో ముందుకురాని రైతులు


