‘మీ డాడీ బాగున్నాడా అమ్మ.. మళ్లీ కేసీఆర్ రావాలి’
యాదగిరిగుట్ట: ‘మీ డాడీ బాగున్నాడా.. మళ్లీ కేసీఆర్ రావాలి.. ఒక్క మీటింగ్ పెట్టమను నాయనను.. అందరం కలిసికట్టుగా వస్తాం.. రేవంత్‌రెడ్డి వచ్చినాక బంగారం లేదు.. చీరలు లేవు.. ఏమీ ఇస్తలేడు’ అంటూ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో మహిళలు సంభాషించారు. గురువారం యాదగిరి క్షేత్రానికి వచ్చిన కల్వకుంట్ల కవితను కొండపైకి వెళ్లే మార్గంలో రెండవ ఘాట్ రోడ్డు వద్ద వడాయిగూడెం గ్రామానికి చెందిన సుక్కల లక్ష్మితో పాటు పలువురు మహిళలు కలిశారు. ఈ సందర్భంగా బాగున్నారా అంటూ కవిత వారిని పలకరించి ‘రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.4వేలు ఇస్తుందా.. కాంగ్రెస్ పాలన ఏవిధంగా ఉంది.. అందరికి చీరలు వచ్చాయా.. పథకాలు అందుతున్నాయా’ అని అడిగారు. దీంతో సుక్కల లక్ష్మి మాట్లాడుతూ.. కేసీఆర్ ఉండగా చీరలు ఇచ్చిండు, ఒక్కసారి కేసీఆర్‌ను మీటింగ్ పెట్టమనుండ్రి ఎంత మందిమి వస్తామో రేవంత్‌రెడ్డికి తెలుస్తుంది. డాడీ బాగుండా.. మీ నాయన ఆరోగ్యంగా ఉండాలి అంటూ చెప్పింది. రేవంత్‌రెడ్డికి ఓటు వేసి ఘోరంగా మోసపోయామని కవితతో మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
● వాహనాల నిలిపివేత
కల్వకుంట్ల కవిత కాన్వాయ్‌లోని వాహనాలు కొండపైకి వెళ్లకుండా ఎస్‌పీఎఫ్ సిబ్బంది నిలిపివేశారు. అన్ని వాహనాలకు అనుమతి లేదని, కవిత వాహనంతో పాటు మరో 4 వాహనాలను మాత్రమే పంపిస్తామని చెప్పారు. అనంతరం దేవస్థానం అధికారులు జోక్యం చేసుకొని వాహనాలను కొండపైకి పంపించారు.
యాదగిరిగుట్టలో కల్వకుంట్ల కవితతో
మహిళల సంభాషణ


