పాలకుల నిర్లక్ష్యం.. రైతులకు శాపం
చిట్యాల: పత్తి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన రైతులకు శాపంగా మారిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. గురువారం చిట్యాల మండల పరిధిలోని పెద్దకాపర్తి గ్రామ శివారులోని పత్తి చేలను ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. వరుసగా కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పత్తి పాడవుతుందని, సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో ఏరిన పత్తిని నిల్వ చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు చిరుమర్తి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం దళారుల చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. పత్తితీత మొదలై నెలరోజులు దాటినా సీసీఐ కొనుగోళ్లు ప్రారంభించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రైతుల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలిందని ఆరోపించారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఆవుల ఐలయ్య, కల్లూరి మల్లారెడ్డి, కొలను వెంకటేష్, ఆరూరి శ్రీశైలం, మర్రి జలేంధర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి తదితరులు ఉన్నారు.
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే
చిరుమర్తి లింగయ్య


