వివాహేతర సంబంధంతో పరువు తీసిందని హత్య
సూర్యాపేటటౌన్: వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబం పరువు తీస్తుందని కుటుంబ సభ్యులే మహిళను హత్య చేశారు. ఈ నెల 21న ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ తెలిపారు. గురువారం డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. ఏపూర్ గ్రామానికి చెందిన కొరివి మల్లయ్య, భిక్ష్మమమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. మల్లయ్య డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్దిరోజులుగా భిక్ష్మమమ్మ సమీప గ్రామానికి చెందిన మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు హెచ్చరించినా భిక్షమమ్మ మాట వినకపోవడంతో కుటుంబం పరువు పోతుందని భర్త మల్లయ్య, ఇద్దరు కుమారులు ప్రవీణ్, భరత్‌తో కలిసి భిక్ష్మమ్మను హత్య చేయాలని స్కెచ్ వేశారు. ఈ మేరకు మల్లయ్య అన్న కుమారుడు మహేష్, స్నేహితులు వంశీ, జనార్దన్‌తో కలిసి గ్రామంలో నడిరోడ్డుపై భిక్షమమ్మని కర్కశంగా కత్తితో గొంతుకోసి హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐలు శ్రీకాంత్‌గౌడ్, మహేశ్వర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఏపూర్ గ్రామంలో మహిళ హత్య కేసులో నిందితుల అరెస్టు


