ప్రజల చెంతకే ఎయిమ్స్ సేవలు
బొమ్మలరామారం : బీబీనగర్ ఎయిమ్స్ సేవలు గ్రామీణులకు సైతం చేరువ అవుతున్నాయి. బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎయిమ్స్ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్‌హెచ్‌టీసీ) సత్ఫలితాలనిస్తోంది. సాధారణ జబ్బులతో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధులకు ఇక్కడ సేవలందిస్తున్నారు. నిత్యం వైద్యసిబ్బంది అందుబాటులో ఉంటూ నాణ్యమైన సేవలు అందజేస్తుండటంతో ప్రజలు ఎయిమ్స్, భువనగిరి, హైదరాబాద్‌కు వెళ్లాల్సిన బాధ తప్పింది. ఓపీ గతంలో 30 నుంచి 60 వరకు వస్తుండగా.. ప్రస్తుతం 180కి పైగా నమోదవుతోంది. సీజన్ వ్యాధుల సమయంలో రెట్టింపు పేషెంట్లు వస్తున్నారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
రూరల్ హెల్త్ సెంటర్‌లో ఎయిమ్స్ వైద్య బృందం వారంలో నాలుగు రోజులు అందుబాటులో ఉంటుంది. మంగళవారం సైక్రియాటిస్ట్, బుధవారం పిల్లల డాక్టర్, పిడియాట్రిక్, గురువారం కంటి వైద్యుడు, ఆప్తామాలజీ, శుక్రవారం జనరల్ సర్జన్ విధులు నిర్వహిస్తున్నారు. మిగతా రోజుల్లోనూ జనరల్ మెడిసన్, గైనకాలజిస్టులు సేవలను అందజేస్తున్నారు. రోజూ ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12.30 వరకు సేవలు అందిస్తున్నారు. సీరియస్ కేసులు ఉంటే బీబీనగర్ ఎయిమ్స్‌కు రెఫర్ చేస్తున్నారు.
అవగాహన సదస్సులు
ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ వైద్యులతో కలిసి ఎయిమ్స్ డాక్టర్లు అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు, బాలింతలు, గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల్లో రొమ్ము క్యాన్సర్ నివారణ, తల్లి,బిడ్డకు పోషకాహారం, ముర్రుపాల ప్రాధాన్యత వంటి అంశాలపై కళా రూపాల ద్వారా చైతన్యం కలిగిస్తున్నారు.
ఔట్ పేషెంట్లు పెరిగారు
స్పెషలిస్టు వైద్యుల సేవలు అందుబాటులోకి రావడంతో ఓపీ పెరిగింది. ప్రస్తుతం రోజూ 150కి పైగా పేషెంట్లు వస్తున్నారు. ఎయిమ్స్ వైద్యులే ఆర్‌హెచ్‌టీసీ ద్వారా పీహెచ్‌సీలో ప్రభుత్వ వైద్యులతో కలిసి సేవలందిస్తున్నారు. దీంతో రోగులు బీబీనగర్ ఎయిమ్స్‌కు వెళ్లే పనిలేకుండా పోయింది. అత్యవసర వైద్యం అవసరమైతే ఎయిమ్స్ ఆస్పత్రికి రెఫర్ చేస్తారు.
– సుమలత, బొమ్మలరామారం
మండల వైధ్యాధికారి
స్థానికంగానే నాణ్యమైన వైద్యసేవలు
బొమ్మలరామారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఎయిమ్స్ వైద్యసేవలు అందుతున్నాయి. దీంతో బీబీనగర్‌కు వెళ్లకుండా దూరభారం తప్పుతుంది.అన్నిరకాల స్పెషలిస్టు వైద్యులు వస్తున్నారు. నాణ్యమైన వైద్య సేవలు లభిస్తున్నాయి. తప్పనిసరి అయితేనే బీబీనగర్ ఎయిమ్స్‌కు పంపుతున్నారు. నాతో పాటు చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– జూపల్లి లింగం, బొమ్మలరామారం
ప్రజల చెంతకే ఎయిమ్స్ సేవలు
ప్రజల చెంతకే ఎయిమ్స్ సేవలు
ప్రజల చెంతకే ఎయిమ్స్ సేవలు


