ప్రత్యేక గ్రీవెన్స్‌కు 67 దరఖాస్తులు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌కు 67 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 20 దరఖాస్తులు ఉన్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ఉద్యోగులు, ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. ఉద్యోగులు సైతం తమ సమస్యలు తెలియజేసేందుకు ప్రతి నెల మూడో గురువారం ఉద్యోగవాణి పేరుతో కలెక్టర్ వెసులుబాటు కల్పించారు. దీంతో రాత్రి వరకు దరఖాస్తులు అందజేశారు.
వినతులు ఇలా..
● మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని చౌటుప్పల్‌లోని రెసిడెన్షియల్ బాలికల పాఠశాల ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి జాహెదా బేగం వినతిపత్రం అందజేశారు.
● టీఎస్ స్వాన్ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు రావడం లేదని పలువురు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ వెంటనే రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడారు.
● ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తమకు వేతనాలు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్య తెలుసుకున్నారు.
● ఆలేరులోని రెసిడెన్షియల్ స్కూల్‌లో అడ్మిషన్ కోసం కందుల రాజు అనే విద్యార్థి విన్నవించగా ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసి సీటు ఇవ్వాలని ఆదేశించారు.
● బ్రాహ్మణపల్లిలో వైన్స్‌కు రెండు వైపులా దారి ఇవ్వడంపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.


