మద్యం టెండర్లు 2,766
● ముగిసిన గడువు.. స్పందన అంతంతే
భువనగిరి: మద్యం టెండర్ల దరఖాస్తు గడువు గురువారంతో ముగిసింది. గడువు పొడిగించినా స్పందన రాలేదు. అదనంగా 129 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. జిల్లాలో 82 మద్యం దుకాణాలకు సెప్టెంబర్ 26నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఈ నెల 18వ తేదీతో గడువు ముగియగా 2,647 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వ అంచనాలు తప్పడంతో ఈ నెల 23 వరకు గడువు పొడిగించింది. మొత్తంగా 2,766 దరఖాస్తులు వచ్చాయి. గతసారి 3,969 దరఖాస్తులు రాగా.. ఈసారి గడువు పెంచినా 1,193 దరఖాస్తులు తక్కువగానే వచ్చాయి. గతసారి రూ.79.38 కోట్లు సమకూరగా.. ఈసారి రూ.83.28 కోట్ల ఆదాయం వచ్చింది.
ఎల్లంబావి వైన్స్‌కు 91 దరఖాస్తులు
అత్యధికంగా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామ వైన్స్‌కు 91 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈనెల 27న రాయగిరిలోని సోమా రాధాకృష్ణ ఫంక్షన్ హాల్‌లో డ్రా తీయనున్నారు.
పాఠశాలల తనిఖీ
అడ్డగూడూరు: మండలంలోని కోటమర్తి జెడ్పీహెచ్‌ఎస్, ప్రాథమిక పాఠశాల, డి.రేపాకలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను డీఈఓ సత్యనారాయణ గురువారం తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. మధ్యాహ్న భోజనం రుచి చూశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ఉపాధ్యాయులో పాఠాలో ఎలా బోధిస్తున్నారని ఆరా తీశారు. సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవి వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. ఆయన వెంట ఎంఈఓ సబిత, ఉపాధ్యాయులు ఉన్నారు.
పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి, సీఈఓకు నోటీసులు
గుండాల: గుండాల పీఏసీఎస్ పర్సన్ ఇంచార్జి, సీఈఓకు జిల్లా సహకార అధికారి (డీసీఓ) నోటీసులు జారీ చేశారు. గుండాల మండలం సుద్దాల గ్రామంలో చేపట్టిన పెట్రోల్ బంక్ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సంఘం మాజీ డైరెక్టర్ సంగి బాలకొమురయ్య ఆగస్టు 18వ తేదీన డీసీఓకు ఫిర్యాదు చేశారు. డీసీఓ ఆదేశాల మేరకు మోత్కూరు అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారణ చేపట్టారు. రికార్డులు, తీర్మానాలను పరిశీలించారు. పెట్రోల్‌బంక్ సివిల్ వర్క్సను సంఘం డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డికి, ఐవోసీఎల్ మిషనరీ పనులను లలితా ఎంటర్‌ప్రైజెస్ (దినకర ఎంటర్ ప్రైజెస్) అప్పగించారు. విద్యాసాగర్‌రెడ్డి, దినకర ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలోనే పనులను చేపట్టాల్సి ఉంది. కానీ కొన్ని పనులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగినట్లు గుర్తించారు. అంతేకాకుండా టెండర్లు పిలవకుండా, ఒప్పంద పత్రం లేకుండా రూ.30 లక్షల పనులను డైరెక్టర్ విద్యాసాగర్‌రెడ్డికి అప్పగించినట్లు తేలింది.వీటిపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పర్సన్ ఇంచార్జి లింగాల భిక్షంగౌడ్, సీఈఓ నాగయ్యకు గురువారం నోటీసులు జారీ చేసినట్లు డీసీఓ తెలిపారు. సదరు డైరెక్టర్‌కు ఇచ్చిన రశీదులపై పర్సన్ ఇంచార్జి, సీఈఓ సంతకాలు ఎందుకు చేశారని, చేసిన పనులకు కాంట్రాక్టర్ నుండి కాకుండా సంఘం నుండి ఎందుకు చెల్లించారో సంజాయిషీ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.


