
సీపీఆర్ చేద్దాం.. ప్రాణం పోద్దాం
ప్రాణాలు కాపాడవచ్చు
రాజాపేట: ఎవరైనా కార్డియాక్(గుండెపోటు)కు గురైనప్పుడు తొలిక్షణం మనం స్పందించగలిగితే వారికి పునర్జన్మ ఇచ్చిన వారమవుతాం. ఎలాంటి పొరపాటు చేసినా, సమయోచితంగా వ్యవహరించకపోయినా ఎంతో విలువైన ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అందుకే సీపీఆర్ (కార్డియో పల్మొనరీ రెససిటేషన్)పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపాటి మెలకువలు నేర్చుకుంటే ఎంతోమందికి ఉపయోగపడుతామని అంటున్నారు.
వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో అవేర్‌నెస్ వీక్
వయసుతో నిమిత్తం లేకుండా ఇటీవల కాలంలో ఎంతోమంది గుండెపోటుతో మృతి చెందుతున్నారు.గుండె ఆగిపోయిన వెంటనే బాధితుల ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడే హృదయ శ్వాసకోశ పునరుజ్జీవ చర్యపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వైద్యారోగ్య శాఖ ‘సీపీఆర్ అవేర్‌నెస్ వీక్’ పేరుతో ఈనెల 13వ తేదీ నుంచి నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు ఇటీవల ముగిశాయి.
వీరికి అవగాహన
ఫ్రంట్‌లైన్ వర్కర్లు పోలీసులు, ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బంది, మున్సిపాలిటీలు, పంచాయతీ సిబ్బందితో పాటు కళాశాలలు, ఉన్నత పాఠశాలల అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సీపీఆర్‌పై అవగాహన కల్పించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నలుగురు డాక్టర్లను ఎంపిక చేశారు. వీరిలో డాక్టర్ విజయ్, డాక్టర్ కాటమరాజు, డాక్టర్ అశ్వినికుమార్, డాక్టర్ హేమంత్ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,516 మందికి సీపీఆర్‌పై అవగాహన కల్పించినట్లు సీపీఆర్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సుమన్ కళ్యాణ్ తెలిపారు.
పెరుగుతున్న గుండెపోటు మరణాలు
కార్డియో పల్మొనరీ
రెససిటేషన్‌తో పునర్జన్మ
ఎంపిక చేసిన కేటగిరీల్లో 1,516
మందికి సీపీఆర్‌పై అవగాహన
ముగిసిన అవేర్‌నెస్ ప్రోగ్రాం
సీపీఆర్ ద్వారా ఆపదలో ఉన్న వ్యక్తి ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండాలి. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఆరోగ్య, అంగన్‌వాడీ సిబ్బందికి సీపీఆర్‌పై ప్రత్యేక అవగాహన కల్పించాను.
– డాక్టర్ విజయ్‌కుమార్,
మోటకొండూరు మండల వైద్యాధికారి
సీపీఆర్ చేసే విధానం
సీపీఆర్ అనేది అత్యవసర పరిస్థితుల్లో.. ముఖ్యంగా ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ప్రాణా లను కాపాడే పద్ధతి. ఈ ప్రక్రియలో బాధితుడి చాతీపై రెండు చేతులతో రెండు నిమిషాల్లో కనీసం 150 సార్లు కుదింపులు చేయాలి. ఇలా చేస్తూనే మధ్యమధ్యలో నోటి ద్వారా కృత్రిమ శ్వాస అందజేయాలి. ఈ విధంగా చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడి శరీరంలోని అవయవాలతో పాటు మెదడుకు ఆక్సీజన్ చేరుతుంది. పడిపోయిన వ్యక్తి తిరిగి శ్వాస తీసుకుంటున్నాడా లేదా గమనించాలి. తిరిగి శ్వాస తీసుకున్నట్లయితే సీపీఆర్ చేయడం ఆపేసి బాధితుడుని అతను ఉన్నస్థానం నుంచి పక్కకు ఒక వైపునకు తిప్పి పడుకోబెట్టాలి. ఆ తరువాత 108కు సమాచారం అందజేయడం, లేదా మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించాలి.

సీపీఆర్ చేద్దాం.. ప్రాణం పోద్దాం