
కలెక్టర్.. ఉపాధ్యాయుడిగా మారిన వేళ
రామన్నపేట: కలెక్టర్ హనుమంతరావు ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా చదవి పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని సూచించారు. బుధవారం రామన్నపేటలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం పదో తరగతికి వెళ్లారు. గణితం సబ్జెక్ట్‌కు సంబంధించి బహుపదులు పాఠం బోధించి విద్యార్థులకు ప్రశ్నలు వేశారు. సమాధానం చెప్పిన విద్యార్థులను అభినందించారు. ఈశ్వర్ అనే హాస్టల్ విద్యార్థి నాలుగు రోజులుగా పాఠశాలకు రాకపోవడంతో నేరుగా అతని తల్లికి ఫోన్ చేసి మాట్లాడారు. అనారోగ్యం చేయడంతో బడికి పంపలేదని ఆమె కలెక్టర్ తెలిపారు. ఇంట్లోనే ఉన్న ఈశ్వర్‌తోనూ కలెక్టర్ మాట్లాడి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. హాస్టల్‌లో వసతులు, భోజనం, వార్డెన్ పనితీరు గురించి ఈశ్వర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యం మెరుగుపడిన తరువాత క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని సూచించారు. ఆయనవెంట తహసీల్దార్ లాల్‌బహదూర్‌శాస్త్రి, హెచ్‌ఎం జరీనా ఉన్నారు.
విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరి సస్పెన్షన్
అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన రికార్డ్ అసిస్టెంట్ చక్రపాణి, సబార్డినేట్ కోటేశ్వర్‌ను సస్పెండ్ చే యాలని డీఈఓను కలెక్టర్ ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

కలెక్టర్.. ఉపాధ్యాయుడిగా మారిన వేళ