
ఎదుళ్ల రిజర్వాయర్ వద్ద ఎఫ్‌ఎల్‌ఎస్ పెంచొద్దు
చౌటుప్పల్: శివన్నగూడెం ప్రాజెక్టుకు నీరందించే ఎదుళ్ల రిజర్వాయర్ వద్ద ఎఫ్‌ఎల్‌ఎస్(ఫుల్ లెవల్ సప్లయ్)ను పెంచకుండా చూడాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదుళ్ల రిజర్వాయర్ నుంచి శివన్నగూడెం ప్రాజెక్టుకు నీటిని తీసుకొచ్చేందుకు రూ.1,800 కోట్ల నిధులతో ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు సాధించినట్టు గుర్తుచేశారు. ఎఫ్‌ఎల్‌ఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ 440కి అంగీకరించొద్దన్నారు. అవసరమైతే ప్రభుత్వంతో తాను మాట్లాడుతానని పేర్కొన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్ ద్వారా చౌటుప్పల్, నారాయణపురం మండలాలతోపాటు దండుమల్కాపురం గ్రామంలోని ఇండస్ట్రీయల్ పార్క్‌కు సైతం తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. శివన్నగూడెం రిజర్వాయర్ కింద డిస్టిబ్యూషన్ నెట్‌వర్క్ పనుల కోసం సర్వే నిర్వహించి డీపీఆర్ సిద్ధ చేయాలన్నారు. చౌటుప్పల్ మండలానికి మూసీ జలాలు అందించేందుకుగాను రంగారెడ్డి జిల్లా కొత్తగూడెం గ్రామం వద్ద చిన్న మూసీపై ప్రతిపాదించిన లిఫ్ట్ పథకంపై దృష్టిసారించాలని సూచించారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి