
పునరావాసం కలి్పంచండి
గ్రామాన్నీ తీసుకోండి..
ప్రభుత్వాన్ని కోరుతున్న బీమరిగూడెం ప్రజలు..‘గంధమల్ల’కు సాగు భూముల సేకరణ
తుర్కపల్లి: ‘బువ్వ పెట్టే భూమి గంధమల్ల ప్రాజెక్టులో పోతుంది.. ఇక మిగిలింది కేవలం ఊరే. కొద్దోగొప్పో భూమి ఉన్నా దాంతో తమకు ఎలాంటి ప్రయోజనమూ ఉండదు.. భూములే లేనప్పుడు మేమెట్లా బతికేది.. అంటూ తుర్కపల్లి మండలం భీమరిగూడెం, తెట్టకుంట గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. తమ గ్రామాన్ని కూడా రిజర్వాయర్‌కు తీసుకొని మరోచోట పునరావాసం కల్పించాలని వేడుకుంటున్నారు’. ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టింది. 1.41 టీఎంసీల సామర్థ్యంతో రూ.575.75 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు కోసం వివిధ గ్రామాల్లో 2,500 మంది రైతులకు సంబంధించి 994.35 ఎకరాల భూములు సేకరించాల్సి ఉంది. ఇందులో మూడు కిలో మీటర్ల మేర నిర్మించే కట్ట నిర్మాణంలో 112 ఎకరాల భూములు మునిగిపోతున్నాయి. వీటితో పాటు మిగతా భూములు కూడా ముంపునకు గురికానున్నాయి. ముంపు కారణంగా బీమరిగూడెం, తెట్టకుంట గ్రామాల ప్రజలు పూర్తిగా ఉపాధి కోల్పోతున్నారు.
బతుకునిచ్చిన భూములు పోతున్నాయి..
ఇళ్లే మిగులుతున్నాయి
బీమరిగూడెంలో 50 నుంచి 60 కుటుంబాలు ఉంటాయి. వీరికి వ్యవసాయమే జీవనాధారం. తాతలకాలం నాటినుంచి సేద్యం చుసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామంలో 100 ఎకరాలకు పైగా ఉన్న సాగు భూములు ఉండగా అవన్నీ గంధమల్ల రిజర్వాయర్ ముంపు పరిధిలోకి వస్తున్నాయి. రెవెన్యూ శాఖ సర్వే ప్రకారం కేవలం ఇళ్లు మాత్రమే మిగులుతున్నాయి. ముంపు భూములకు ఎకరాకు రూ.24.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అందుకు గ్రామస్తులు సంసిద్ధత వ్యక్తం చేసి భూములివ్వడానికి అంగీకారం తెలిపారు.
భవిష్యత్‌పై ఆందోళన
బీమరిగూడెం వ్యవసాయ భూములన్నీ గంధమల్ల చెరువుకు అనుకుని ఉంటాయి. ఇళ్లు కూడా చాలా వరకు వ్యవసాయ బావుల వద్దనే నిర్మించుకున్నారు. గ్రామం రిజర్వాయర్ పక్కనే ఆనుకొని ఉండటం వల్ల భవిష్యత్‌లో ఇళ్లలోకి విషపురుగులు, క్రిమికీటకాలు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.. తాము ఇక్కడ నివాసం ఉండలేమంటున్నారు.
పునరావాసమే ఏకై క మార్గం
తమకు జీవనాధారమైన భూములు పోవడం, స్థానికంగా ఉపాధే లేనప్పుడు ఊర్లో ఉండి ఏం చేయాలని గ్రామస్తులు అంటున్నారు. మరోవైపు గ్రామంలో ఉన్న పాఠశాల రెండేళ్ల కిత్రం మూతపడింది. సరైన రవాణా సౌకర్యం కూడా లేదని, జగదేవ్‌పూర్ నుంచి వెళ్లే కాలువ నీటితో జాలు వస్తుందని, ఇన్ని సమస్యల మధ్య ఉండలేమని.. తమ గ్రామాన్ని కూడా భూసేకరణ కింద తీసుకొని ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద మరోచోట పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
జీవనోపాధి కోల్పోతున్న గ్రామస్తులు
మిగిలింది ఊరు మాత్రమే..
ఇప్పటికే మౌలిక సౌకర్యాలు లేక,
నీటి జాలుతో అవస్థలు
భవిష్యత్‌లో మరిన్ని సమస్యలు
చుట్టుముట్టే ప్రమాదం
గ్రామాన్ని కూడా రిజర్వాయర్‌లో కలుపుకొని మరోచోట పునరావాసం కల్పించాలని డిమాండ్

పునరావాసం కలి్పంచండి