
2023లో నిలిచే.. ఇన్నాళ్లకు గుర్తొచ్చే
యాదగిరిగుట్ట: యాదగిరి కొండపైకి చేరుకునేందుకు చేపట్టిన నెట్‌వర్క్ అర్చ్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు పునఃప్రారంభం అయ్యాయి. 64 మీటర్ల పనుల కోసం రెండేళ్లకు పైగా నిరీక్షించాల్సి వచ్చింది. పనులు పూర్తి కావడానికి నాలుగు నెలల సమయం పట్టవచ్చని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. బ్రిడ్జి అందుబాటులోకి వస్తే భక్తులు నృసింహుడి సన్నిధికి సులువుగా చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.
2021లో రూ.32కోట్లతో పనులకు శ్రీకారం
ఆర్యవైశ్య సత్రంనుంచి మొదటి ఘాట్‌రోడ్డులోని జీయర్ కుటీర్ వద్ద ఉన్న రోడ్డును అనుసంధానం చేసేందుకు నెట్‌వర్క్ ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. 490 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు పనుల కోసం రూ.32 కోట్లు కేటాయించారు. 2021 సంవత్సరం చివరిలో పనులకు శ్రీకారం చుట్టారు.
బీకేమ్ సంస్థకు కాంట్రాక్ట్
నెట్‌వర్క్ ఆర్చ్ బ్రిడ్జి పనులను సీఫైవ్ కాంట్రాక్టు సంస్థ దక్కించుకుంది. మొదట్లో పనులను వేగంగా జరిగినప్పటికీ కొంతకాలం తరువాత మందగించాయి. 2023లో పూర్తిగా నిలిచిపోయాయి. నిధుల కొరత, లండన్ నుంచి కేబుల్స్ రావాలనే సాకుతో అప్పట్లో సాకులు చూపారు. నానాటికీ ఆలయానికి భక్తుల తాకిడి పెరగడంతో బ్రిడ్జికి ప్రాధాన్యం ఏర్పడింది. కొండపైకి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాంట్రాక్ట్ సంస్థ యజమాన్యాన్ని ఆర్‌అండ్‌బీ శాఖ పలుమార్లు ఆదేశించినా స్పందన రాకపోవడంతో కాంట్రాక్టు సంస్థను రద్దు చేసింది. తదుపరి బీకేమ్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించగా రెండు రోజుల క్రితం పనులు ప్రారంభించింది.
యాదగిరీశుడి సన్నిధిలో నెట్‌వర్క్ బ్రిడ్జి పనులు పునఃప్రారంభం
64 మీటర్ల మేర పెండింగ్
పూర్తయ్యేందుకు నాలుగు
నెలలకు పైగా సమయం